Sheikh Hasina: భారత్‌కు షేక్ హసీనా కృతజ్ఞతలు.. 1975 నాటి రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం, ప్రజలు తనకు ఆశ్రయం కల్పించి ఆదరించినందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. 1975లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు అండగా నిలిచినట్లుగానే ఇప్పుడు కూడా భారత్ తనను ఆదరించిందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు షేక్ హసీనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఘర్షణల్లో బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో హసీనా, ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాలు
ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత ఆరేళ్లకు, 1981 మేలో ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లారు.
అనంతరం ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం భారత్ తనకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
'వారు నన్ను చంపేయొచ్చు.. అయినా వెళ్తా'
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లేందుకు తనకు ఎలాంటి భయం లేదని పునరుద్ఘాటించారు.
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వెళ్లే విషయంలో ఎలాంటి మార్పు లేదు. తిరిగి వెళ్తున్నందుకు నాకేమీ భయం లేదు. వారు నన్ను చంపేయొచ్చు.. హింసించొచ్చు.. అరెస్టు చేయొచ్చు. అయినప్పటికీ, అక్కడికి వెళ్లడం నా బాధ్యత అని హసీనా వ్యాఖ్యానించారు.
అయితే డిసెంబర్‌లో ఏ తేదీన బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.