Smith Macher: కాక్‌పిట్‌లో దాడిని ఎదుర్కొని.. వందల ప్రాణాలకు రక్షణగా నిలిచిన ధీశాలి .. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్యమైన, అత్యంత ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే కాక్‌పిట్‌లో ఓ పైలట్ తన సహచరుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచిన భారత సంతతి పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్.. తీవ్ర గాయాలైనప్పటికీ విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి సమీపంలోని విమానాశ్రయంలో దించారు. ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి పెను ప్రమాదాన్ని తప్పించడంలో కీలకంగా మారాయి.
వివరాలు
అసలేం జరిగింది?
ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది.
విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కో-పైలట్ కత్తితో కమాండర్‌గా ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడు.
ఊహించని ఈ పరిణామంతోనూ స్మిత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ కో-పైలట్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాన్ని కొనసాగించారు.
కాక్‌పిట్‌లో జరుగుతున్న పెనుగులాటను గుర్తించిన విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి, కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారుఆ తర్వాత కెప్టెన్ స్మిత్ అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సమీపంలోని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు.
వివరాలు
ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
అక్కడ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ భారత సంతతికి చెందిన పైలట్. గుజరాతీ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతానికి చెందినవారు.
విమానయాన రంగంలో స్మిత్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా ఆయన తన సేవలను ప్రారంభించారు.
అంతకుముందు భారత చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో దాదాపు 11సంవత్సరాలు పనిచేశారు.
అక్కడ సీనియర్ కమాండర్‌గా,లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
కేవలం విమానాలు నడపడమే కాకుండా..ఇతర పైలట్లకు శిక్షణ ఇవ్వడం,వారి సామర్థ్యాన్ని అంచనా వేయడం వంటి కీలక బాధ్యతలను కూడా చేపట్టారు.
వివరాలు
వేల గంటల విమానయాన అనుభవం
బోయింగ్ 737 కుటుంబానికి చెందిన 737-800, 737 మ్యాక్స్ 8, 737 మ్యాక్స్ 9 విమానాలను నడపడంలో కెప్టెన్ స్మిత్‌కు విస్తృత అనుభవం ఉంది.
ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు సుమారు 9,750 గంటల విమానయాన అనుభవం సంపాదించారు.
ఇందులో 6,400 గంటలకు పైగా పైలట్-ఇన్-కమాండర్‌గా అంటే ప్రధాన పైలట్‌గా విధులు నిర్వర్తించారు.
విమానయానంతో పాటు విద్యారంగంలోనూ స్మిత్ తన అర్హతను సాధించారు. వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
వివరాలు
నెతన్యాహు ప్రశంసలు
కాక్‌పిట్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఒక పెద్ద విపత్తు సంభవించకుండా అడ్డుకోవడంలో స్మిత్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
కాక్‌పిట్‌లోనే ప్రాణాంతక దాడి ఎదురైనా.. విమానంలోని ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా తీవ్ర గాయాల మధ్య కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం ఆయన వృత్తిపరమైన అనుభవాన్ని, సంక్షోభ సమయంలో తీసుకున్న నిర్ణయాల ప్రాధాన్యాన్ని మరోసారి చూపించింది.
వివరాలు
కెప్టెన్ స్మిత్‌కు మోదీ ప్రశంసలు
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను 'హీరో'గా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దేశం మొత్తం ఆయనను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. అనుకోకుండా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పటికీ.. తీవ్ర గాయాల మధ్య ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు స్మిత్ ప్రదర్శించిన ధైర్యం ఎంతో గొప్పదని మోదీ అన్నారు.
తన ఎక్స్ ఖాతాలో మోదీ స్పందిస్తూ.. స్మిత్ మచ్చర్ చూపిన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా భారీ విషాదాన్ని నివారించిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
వివరాలు
'భారత్ స్మిత్‌ను చూసి గర్విస్తోంది': మోదీ
మోదీ ప్రశంసిస్తూ.. ''అనూహ్యంగా ప్రమాదం ఎదురైన సమయంలో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆయన చూపిన తెగువ ప్రయాణికులను రక్షించడంతో పాటు పెను విషాదాన్ని అడ్డుకుంది. మచ్చర్‌ను చూసి భారత్ గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకుని మరింత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
వివరాలు
స్మిత్ సమయస్ఫూర్తిని ప్రశంసించిన ట్రంప్
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రశంసించారు.
ఆయనను 'హీరో'గా అభివర్ణించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తాను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు.
దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోసం కేకలు వేశారని ట్రంప్ వివరించారు.
దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకునే అవకాశం లభించిందని చెప్పారు.
వివరాలు
'ఆయన హీరో'
స్మిత్ త్వరగా కోలుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు. అంతటి తీవ్ర పరిస్థితిలోనూ కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరడం ఆయన అసాధారణ సమయస్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
''పైలట్ త్వరగా కోలుకోవాలి. అంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన కాక్‌పిట్ తలుపు తెరిచారు. అది నిజంగా ప్రశంసించదగిన సమయస్ఫూర్తి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన హీరో'' అని ట్రంప్ అన్నారు.