Saudi Arabia: ఫేస్‌బుక్ పోస్టు వివాదం.. శ్రీలంక తమిళ వలస కార్మికుడికి సౌదీలో ఉరిశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 24 ఏళ్ల శ్రీలంక తమిళ వలస కార్మికుడికి ఉరిశిక్ష పడింది. ఫేస్ బుక్‌లో చేసిన ఓ వ్యాఖ్య ఇస్లాం, ప్రవక్త మహమ్మద్‌ను అవమానించేలా ఉందని సౌదీ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఈ శిక్ష విధించినట్లు సమాచారం. శ్రీలంకలోని కల్మునై సమీపంలోని నట్‌పిడ్డిమునైకి చెందిన శివరాస అనోజన్ ఈ కేసును ఎదుర్కొంటున్నారు. తొలుత అల్-అహ్సా క్రిమినల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సౌదీ ప్రాసిక్యూషన్ అప్పీల్ చేయడంతో కేసు అప్పీల్ కోర్టుకు వెళ్లింది. అనంతరం శిక్షను మరింత పెంచి మరణశిక్షగా మార్చినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు.
వివరాలు
వివాదం ఎలా మొదలైంది?
శ్రీలంకలో జరిగిన ఓ హిందూ తీర్థయాత్రకు సంబంధించిన ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వివాదం మొదలైనట్లు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి.
హిందూ మత విశ్వాసాలు, దేవతలను కించపరిచే వ్యాఖ్యలు తమిళంలో సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు సమాచారం.
దీనిపై స్పందిస్తూ అనోజన్ ఫేస్‌బుక్‌లో ఓ వ్యాఖ్య చేశారు. అయితే ఆ వ్యాఖ్య ఇస్లాం, ప్రవక్త మహమ్మద్‌ను అవమానించేలా ఉందని సౌదీ అధికారులు భావించారు.
ఆ తర్వాత అనోజన్ ఆ పోస్టును తొలగించి, ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
అప్పటికే ఆ వ్యాఖ్యను కొందరు స్క్రీన్‌షాట్ తీసి సౌదీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
2025లో సౌదీకి వెళ్లిన అనోజన్
ఉపాధి కోసం అనోజన్ 2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లారు.
2026 జూలై 2న ఆయనను అరెస్టు చేసినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ పార్లమెంటుకు తెలిపారు.
ఫేస్‌బుక్ వ్యాఖ్యకు సంబంధించిన కేసులో అల్-అహ్సా క్రిమినల్ కోర్టు తొలుత ఐదేళ్ల జైలు శిక్ష, 30 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది.
కేసులో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆయన సోషల్ మీడియా ఖాతాను మూసివేయాలని కూడా ఆదేశించింది.
ఈ శిక్ష సౌదీ అరేబియా యాంటీ-సైబర్ క్రైమ్ చట్టం కింద విధించినట్లు శ్రీలంక అధికారులు, స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
వివరాలు
అప్పీల్ తర్వాత మరణశిక్ష
అనోజన్‌కు విధించిన శిక్షను తగ్గించాలని కోరుతూ ఆయన తరఫున అప్పీల్ దాఖలు చేశారు.
అయితే ఆ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరత్ తెలిపారు.
ఆ తర్వాత సౌదీ ప్రాసిక్యూషన్ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేసి,షరియా చట్టం కింద మరింత కఠినమైన శిక్ష విధించాలని కోరినట్లు ఆయన పార్లమెంటుకు వివరించారు.
ఈనేపథ్యంలో సెప్టెంబర్ 17న అప్పీల్ కోర్టు అనోజన్‌కు మరణశిక్ష విధించినట్లు సమాచారం.
మరణశిక్షకు సంబంధించిన అధికారిక లిఖితపూర్వక తీర్పు కోసం శ్రీలంక విదేశాంగశాఖ తొలుత ఎదురుచూసింది.
అప్పీల్ కోర్టు నిర్ణయాన్ని అనోజన్ న్యాయవాది రియాద్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయానికి మౌఖికంగా తెలియజేసినట్లు అధికారులు చెప్పారు.
అనంతరం సెప్టెంబర్ 20న లిఖితపూర్వక తీర్పు తమకు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
వివరాలు
అనోజన్ కేసులో శ్రీలంక దౌత్య ప్రయత్నాలు
అనోజన్ కేసులో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
రియాద్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయం ఆయనకు కాన్సులర్ సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది.
సౌదీ అధికారులతో దౌత్య మార్గాల్లో చర్చలు జరుపుతున్నామని,తీర్పును సవాలు చేసేందుకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
సెప్టెంబర్ 22న పార్లమెంటులో మాట్లాడిన విదేశాంగ మంత్రి విజిత హెరత్.. న్యాయ,దౌత్య,కాన్సులర్, మానవతా మార్గాల్లో అన్ని అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
సౌదీ రాజును క్షమాభిక్ష కోరుతూ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే తరఫున లేఖను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
కుటుంబ సభ్యుల ఆవేదన
అనోజన్ కేసులో సౌదీలో అయ్యే న్యాయ ఖర్చులను కూడా శ్రీలంక ప్రభుత్వమే భరించనుందని వెల్లడించారు.
అనోజన్‌కు మరణశిక్ష విధించిన విషయం ఆయన స్వగ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
శిక్ష అమలు కాకుండా చూడాలని కుటుంబ సభ్యులు,మద్దతుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తొలుత ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించిన సమయంలోనే ఆయన తల్లిదండ్రులు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌ను సహాయం కోరినట్లు సమాచారం.
వివరాలు
కుటుంబ సభ్యుల ఆవేదన
30లక్షల సౌదీ రియాల్స్ జరిమానా చెల్లించడం, అప్పీల్ కోసం అయ్యే న్యాయ ఖర్చులను భరించడం తమ కుటుంబానికి సాధ్యం కాదని వారు అప్పట్లో తెలిపారు.
అనోజన్ విడుదల, క్షమాభిక్ష కోరుతూ శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు, నిరసనలు కూడా జరిగాయి.
ప్రస్తుతం శ్రీలంక అధికారులు సౌదీ కోర్టు ఇచ్చిన లిఖితపూర్వక తీర్పును పరిశీలిస్తూ తదుపరి న్యాయపరమైన మార్గాలపై దృష్టి పెట్టారు.
అదే సమయంలో రియాద్‌లోని సౌదీ అధికారులతో దౌత్యపరమైన చర్చలను కొనసాగిస్తున్నారు.