LOADING...
Pakistan Floods:  నీటిని వృథా చేయకుండా టబ్స్,కంటెయినర్లలో నిల్వ చేయండి:  పాక్‌ రక్షణ మంత్రి
నీటిని వృథా చేయకుండా టబ్స్,కంటెయినర్లలో నిల్వ చేయండి: పాక్‌ రక్షణ మంత్రి

Pakistan Floods:  నీటిని వృథా చేయకుండా టబ్స్,కంటెయినర్లలో నిల్వ చేయండి:  పాక్‌ రక్షణ మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో వరదలు తీవ్ర సమస్యగా మారాయి.లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరదలను అదృష్టంగా భావించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు నీటిని వృథా పోనివ్వకుండా కంటెయినర్లలో నిల్వ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో,ముఖ్యంగా పంజాబ్ సహా అనేక ప్రావిన్స్‌లలో,రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాక్ సమాచారశాఖ తెలిపిన వివరాల ప్రకారం,2,000కు పైగా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్క పంజాబ్‌లోనే సుమారు 7లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు అంచనా. పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMA)నివేదిక ప్రకారం,జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854మంది మరణించగా,1,100కు పైగా మంది గాయపడ్డారు.

వివరాలు 

సహాయ చర్యల ఆలస్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

ఈ పరిణామాలపై ప్రభుత్వం సహాయ చర్యలను ఆలస్యంగా తీసుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ఒక స్థానిక మీడియా ఛానల్‌తో చేసిన ఇంటర్వ్యూలో, "వరదలకు ప్రతికూలంగా నిరసనలు చేస్తున్న ప్రజలు ముందుగా ఆ నీటిని కాపాడుకోవాలి. వారి ఇళ్లలోని టబ్‌లు, కంటెయినర్లలో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని అదృష్టంగా భావించి భవిష్యత్ అవసరాలకు నిల్వ చేయాలి" అని చెప్పారు. అంతేకాకుండా మెగా ప్రాజెక్టుల కోసం 10-15ఏళ్లు వేచిచూడొద్దని, తక్షణం పూర్తి అయ్యే చిన్న డ్యామ్‌లు నిర్మించుకోవాలని సూచించారు. నీటిని వృథాగా పోనిస్తున్నామని, నిలువ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.