Page Loader
Terrorist Activities: భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష
భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష

Terrorist Activities: భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన కేసులో బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం బంగ్లాదేశ్‌ జాతీయుడైన జహీదుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఇండియా శాఖ ఆదేశాల మేరకు భారత్‌లో ఉగ్రదాడులను ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు జహీదుల్ ఇస్లాం మందుగుండు సామాగ్రి సేకరణ, దోపిడీ, కుట్ర, నిధుల సేకరణ వంటి నేరాల్లో నేరస్థుడిగా నిర్ధారించారు. కోర్టు అతడికి రూ.57,000 జరిమానా కూడా విధించింది. ఇప్పటి వరకు మొత్తం 11 మందికి శిక్షలు విధించారు. జహీదుల్ ఇస్లాం 2005లో బంగ్లాదేశ్‌లో వరుస పేలుళ్లకు పాల్పడినందుకు అరెస్టై, ఆపై పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.

Details

కీలక అధారాలను సేకరించిన ఎన్‌ఐఏ

2014లో అతడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. JMB అధినేత సలావుద్దీన్ సలేహిన్‌తో కలిసి జహీదుల్, 2014 అక్టోబర్‌లో బుర్ద్వాన్ పేలుళ్లకు పథకం వేశాడు. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించి పలు కీలక ఆధారాలను సేకరించింది. దోపిడీ కేసులతో పాటు, భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద ప్రచారానికి జహీదుల్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. జహీదుల్ ఇస్లాం బెంగళూరుకు పారిపోయి, అక్కడ పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి ప్రాంతాల నుంచి ముస్లిం యువతను రిక్రూట్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్నాడు. 2018 జనవరిలో బుద్ధగయలో జరిగిన పేలుడులో కూడా జహీదుల్ ఇస్లాం, అతని సహచరులు కీలకంగా వ్యవహరించినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.