సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు
పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అత్త మహ్ జబీన్ నూన్, ప్రతిపక్ష పార్టీ పీటీఐ న్యాయవాది ఖవాజా తారిఖ్ రహీమ్ భార్య రఫియా తారిక్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ పాకిస్థాన్‌లో ప్రకంపనలు రేపుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఫోన్ కాల్‌లో ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మద్దతు ఇవ్వడం, పాకిస్థాన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించడం గురించి చర్చించడం గమనార్హం. ఫోన్ సంభాషణలో మహ్ జబీన్ నూన్ తన అల్లుడు ఉమర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అతని కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
ఉమర్ ప్రత్యర్థులను దేశద్రోహులుగా అభివర్ణించిన తారిఖ్
రఫియా తారిఖ్ కూడా తన మద్దతు పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్‌కు తెలియజేశారు. సుప్రీంకోర్టు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న విభేదాల నేపథ్యంలో అనేక మంది ప్రజలు ఉమర్‌కు మద్దతుగా ఉన్నట్లు రఫియా తారిఖ్ అనడం ఆ సంభాషణల్లో వినిపిస్తుంది. అంతేకాకుండా ఉమర్ భద్రత చాలా ముఖ్యమని తారిఖ్ స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా చర్య తీసుకునే హక్కు గురించి కూడా ఇద్దరు మాట్లాడాడుకున్నారు. అతని ముందు చాలా మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ హక్కును అనుభవించారని దానిపై ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సబబుకాదని ఇద్దరు మహిళలు మాట్లాడుకున్నారు. అంతేకాదు ఉమర్ ప్రత్యర్థులను తారిక్ దేశద్రోహులుగా అభివర్ణించడం గమనార్హం.
పాకిస్థాన్ ప్రభుత్వం- సుప్రీంకోర్టు మధ్య వివాదం ఇది
గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. అక్టోబర్ వరకు పంజాబ్ ప్రావిన్స్‌లో ఎన్నికలను వాయిదా వేయాలన్న పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) నిర్ణయాన్ని ఏప్రిల్ మొదటి వారంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యతిరేకించింది. దీన్ని రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును తిరస్కరిస్తూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేయడమేనని, దానిని అమలు చేయడం సాధ్యం కాదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ పరిణామం తర్వాత దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేయాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేడయం ప్రారంభించారు.
ఈ ఆడియో క్లిప్‌పై మంత్రుల స్పందన
లీకైన ఆడియో క్లిప్‌పై మంత్రులు స్పందించారు. ఫెడరల్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ ట్విట్టర్‌లో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, ఇందులో కుట్రకోణం దాగి ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించి ఇమ్రాన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జురుగుతున్నానయన్నారు. ఈ ఆడియో క్లిప్‌పై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనా ఉల్లా ఖాన్ ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆడియోలో జరుగుతున్న సంభాషణ గురించి ప్రతి పాకిస్థానీ ఆందోళన చెందుతున్నారని అన్నారు.