
Pakistan: విమాన ప్రయాణంలో 'సర్ప్రైజ్'.. కరాచీ బదులుగా జెడ్డా వెళ్లిన ప్రయాణికుడు
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రయాణాల్లో వింత సంఘటనలు జరగడం కొత్త కాదు. అయితే తాజాగా పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. కరాచీకి వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు విమానంలో ఏకంగా సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరాడు! లాహోర్‌కు చెందిన షాజహాన్ అనే ప్రయాణికుడు, కరాచీ వెళ్లేందుకు డొమెస్టిక్ టెర్మినల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ విమానాన్ని తనదిగా అనుకుని ఎక్కాడు. సిబ్బందికి టికెట్ చూపించగా వారు ఆపలేదు. విమానం గంటలపాటు ప్రయాణించినా కరాచీ చేరకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా.. వారి నోట నుండి బయటపడ్డ నిజం షాజహాన్‌కి కంగుతినిపించింది - అతడు కరాచీకి కాదు, జెడ్డాకు బయలుదేరిన అంతర్జాతీయ విమానంలో ఉన్నాడు!
Details
లాహోర్ కి తిరిగి పంపిన సిబ్బంది
ఈ చేదు విషయాన్ని తెలుసుకున్న ఎయిర్‌లైన్ సిబ్బంది అటుతిరిగి బాధ్యతను ప్రయాణికుడిపైనే నెట్టేయడం ప్రారంభించింది. పైగా అతడిని తిరిగి కరాచీకి పంపేందుకు మరో టికెట్ కొనాలని సూచించారట. దురదృష్టవశాత్తూ అతడి వద్ద పాస్‌పోర్టు కూడా లేకపోవడంతో, జెడ్డా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు కొంతసేపు అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత పరిస్థితి అర్థమై తాను పొరపాటున వచ్చానని స్పష్టంగా చెప్పడంతో లాహోర్‌కి తిరిగి పంపారు. ఈ వివాదంపై పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ స్పందించి, సంబంధిత ప్రైవేటు ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా విధించింది. అసలు లోపం ఎక్కడ జరిగిందంటే- లాహోర్ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ మరమ్మత్తుల కారణంగా అంతర్జాతీయ విమానాలను డొమెస్టిక్ టెర్మినల్ నుంచే పంపిస్తున్నారు. అదే గందరగోళానికి కారణమై, షాజహాన్ జెడ్డా చేరినట్లైంది.