Syria: సిరియా సంక్షోభం.. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్
సిరియాలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితుల్లో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచి వెళ్లడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అదనంగా, ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. అయితే, రష్యా మీడియా సమాచారం ప్రకారం, అసద్ రష్యాలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా మీడియా అసద్‌కు తాము ఆశ్రయం కల్పించినట్లు పేర్కొనడం, ఆ ఊహాగానాలకు ముగింపు పలికినట్టైంది.
అసద్ చనిపోలేదని స్పష్టత
డమాస్కస్ తిరుగుబాటు దళాల ఆధీనంలోకి వెళ్లిన అనంతరం, అసద్ తన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచిపెట్టారు. ఆ తరువాత ఆయన ప్రయాణించిన విమానం గమ్యస్థానంపై అనుమానాలు చెలరేగడంతో విమాన ప్రమాదం జరిగినట్లు వార్తలు వ్యాప్తి చెందాయి. మొదట రష్యా ఈ వార్తలను ఖండిస్తూ అసద్ చనిపోలేదని స్పష్టతనిచ్చింది. ఆ తరువాత, అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరుకున్నారని మీడియా వర్గాలు ధృవీకరించాయి. మానవతా దృక్పథంతో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించిందని వెల్లడించారు.
బషర్ సిరియాను విడిచారని పేర్కొన్న రష్యా
మరోవైపు, తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను విడిచారని రష్యా పేర్కొంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగిన సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.