
Donald Trump: 'డిక్షనరీలో ఆ పదం అంటే నాకు నాకు ఇష్టం': సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో (USA) పాలనా పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల (Tariffs) అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
తన అధికారంలో ఉంటే వివిధ దేశాల దిగుమతి వస్తువులపై సుంకాలు విధిస్తానని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా 'సుంకం' అనేది డిక్షనరీలో ఉన్న చాలా అందమైన పదం అని వ్యాఖ్యానించారు.
అమెరికాలోని కంపెనీలకు ప్రోత్సాహం కల్పించడానికి ఈ టారిఫ్‌లు సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రచారంలో బిజీగా ఉన్నారు.
వివరాలు
300 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సుంకాల అంశంపై మాట్లాడారు. అమెరికాను వినియోగించుకుని శత్రు దేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయన్నారు. ఐరోపా సమాఖ్య మనకు మిత్రపక్షం, కానీ దాని ద్వారా మనకు 300 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందన్నారు. మన దేశ వాణిజ్య ఒప్పందాలు సరైన విధంగా లేవు. తెలివితక్కువ దృష్టితో లేదా డబ్బు పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒప్పందాలు చేశారని బైడెన్ సర్కార్‌పై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
"నేను అధికారంలో ఉన్నప్పుడు చైనాపై 27.5 శాతం టారిఫ్‌లు విధించాను. లేదంటే ఇప్పుడే మన దేశంలో చైనా కార్లు వరదల్లా వచ్చేవి. అలాంటి పరిస్థితి జరిగితే మన ఫ్యాక్టరీలన్నీ మూతపడేవి.ఆటో రంగంలో ఉద్యోగాల కొరత ఉండేది"అని ట్రంప్ పేర్కొన్నారు.
వివరాలు
భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోంది: ట్రంప్
ఈ సందర్భంగా భారత్ గురించి మరోసారి ప్రస్తావించారు. సుంకాల విషయంలో ఆ దేశం కఠినంగా ఉంటోందని వ్యాఖ్యానించారు.
గతవారం కూడా ట్రంప్ సుంకాల అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే.
మోదీ గొప్ప నాయకుడు అని అంటూనే,భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని ఆరోపించారు.
తాను అధికారంలోకి వస్తే భారత్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన తెలిపారు.