Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ వింత ఆఫర్.. ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స!
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతానం కల్పించడంలో సహాయం చేయడానికి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఐవీఎఫ్ చికిత్స కోసం తన వీర్యకణాలు అందించేందుకు మాస్కోలోని ఆల్ట్రావిటా ఫెర్టిలిటీ క్లినిక్‌తో చేతులు కలిపినట్లు తెలిసింది. తమ క్లినిక్ ద్వారా పావెల్ దురోవ్ వీర్యకణాలు ఉపయోగించి ఉచిత ఐవీఎఫ్ చికిత్స పొందవచ్చని ప్రకటించింది. దురోవ్‌ను ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా అభివర్ణిస్తూ, అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్స అందించనున్నట్లు క్లినిక్ పేర్కొనడం గమనార్హం.
వీర్యదానంతో చాలా జంటలకు సంతానం
దురోవ్ గతంలో తనకు 100 మందికి పైగా సంతానం ఉన్నారంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. సంతానలేమి సమస్యను అర్థం చేసుకున్న తర్వాత, వీర్యదానంలో రిజిస్టర్ చేసుకుని చాలా జంటలకు సంతానం కల్పించాననని దురోవ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్య తీవ్రమవుతోందని, అలాంటి వారికి సంతానం ఇచ్చి వారి జీవితాల్లో ఆనందం తెచ్చినందుకు గర్వపడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.