నవంబర్ 1 నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలని 17లక్షల మందికి పాకిస్థాన్ డెడ్‌లైన్
పాకిస్థాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చినపై ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వచ్చినవారు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్థాన్‌కు కొన్ని లక్షల మంది శరణార్థులుగా వలస వచ్చారు. పాకిస్థాన్‌లో అక్రమంగా నివరిస్తున్న వారి సంఖ్య సుమారు 17లక్షలకు పైగా ఉంటుందని ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగిటి పేర్కొన్నారు. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్ళడానికి నవంబర్ 1 వరకు గడువు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
అక్రమ వలసదారులను చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశామని మంత్రి సర్ఫరాజ్ బుగిటి తెలిపారు. పాస్‌పోర్ట్ లేకుండా దేశంలోనికి అనుమతించే ఏకైక దేశం పాకిస్థాన్ అని ఆయన అన్నారు. దేశం విడిచి వెళ్లకుంటే, వారి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేస్తామని మంత్రి సర్ఫరాజ్ బుగిటి వెల్లడించారు. పాకిస్థాన్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను తరిమికొట్టాలని జాతీయ అపెక్స్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పీఎం అన్వర్-ఉల్-హక్ కాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఉన్నత స్థాయి భద్రతా అధికారులు హాజరయ్యారు. పాక్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.