Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.
తమ దేశంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారిని నిర్బంధించడమే కాకుండా, ప్రత్యేక సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది. ఈ ప్రక్రియ కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది.
తాజాగా కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపించిందని తెలుస్తోంది. మరి వారిని తరలించడానికి అగ్రరాజ్యం ఎంత వ్యయం చేసిందో తెలుసా?
భారీ ఖర్చుతో భారతీయుల డిపోర్టేషన్
104 మంది వలసదారులను భారత్‌కు తరలించేందుకు అమెరికా 1 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడైంది.
Details
మూడు రెట్లు ఎక్కువ
అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.74 కోట్లకు పైమాటే. సాధారణ పౌర విమానాల కంటే సైనిక విమానాల నిర్వహణ వ్యయం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
గత బుధవారం, అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17ఏ గ్లోబ్‌మాస్టర్ 3 విమానం వలసదారులను తీసుకుని పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
1995లో అగ్రరాజ్యం వాయుసేనలో ఈ విమానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుండి సైనిక బలగాలు, ఆయుధ సామగ్రి, వాహనాల రవాణా కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు.
అంతేగాక అమెరికా చేపట్టిన అనేక సైనిక ఆపరేషన్లలోనూ దీనిని వినియోగించారు.
Details
డిపోర్టేషన్ కోసం మిలిటరీ విమానాల వినియోగం
అక్రమ వలసదారుల తరలింపునకు గతంలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కమర్షియల్ ఛార్టర్ విమానాలను ఉపయోగించేది.
2021 నాటి గణాంకాల ప్రకారం, ఆ ఛార్టర్ విమానాల నిర్వహణ ఖర్చు గంటకు 8,577 డాలర్లు (దాదాపు రూ.7.50 లక్షలు) ఉండేది.
అయితే ట్రంప్ అధికారంలోకి రాగానే తొలిసారిగా అక్రమ వలసదారుల తరలింపునకు మిలిటరీ విమానాలను ఉపయోగించడం ప్రారంభించారు.
సీ-17 మిలిటరీ విమాన ఖర్చు
యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ డేటా ప్రకారం, ఒక్కో సీ-17 మిలిటరీ విమానం రవాణా నిర్వహణ వ్యయం గంటకు 28,562 డాలర్లు (దాదాపు రూ.24.98 లక్షల పైనే) ఉంటుంది.
Details
43 గంటల తర్వాత అమృత్‌సర్‌లో ల్యాండ్
సాధారణ కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా, మిలిటరీ విమానాలు ప్రత్యేకమైన మార్గాల్లో ప్రయాణిస్తాయి.
ఇతర దేశాల్లో గగనతల నియమాలు, మిలిటరీ బేస్‌లలో ఇంధనం నింపుకోవడం వంటివి వీటి ప్రయాణ ఖర్చును పెంచుతాయి.
అందుకే భారత వలసదారులను తీసుకువచ్చిన విమానం అమెరికా నుంచి బయల్దేరిన 43 గంటల తర్వాత అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.
తిరుగు ప్రయాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, వలసదారుల తరలింపునకు మొత్తం 1 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అయినట్లు అంచనా.
అంటే ఒక్కో వలసదారుడిపై 10,000 డాలర్లకు (రూ.8.74 లక్షలు) పైగా అమెరికా వెచ్చించినట్లవుతుంది.