
Nithyananda: బొలీవియాలో భూ ఆక్రమణకు ప్రయత్నించిన 'నిత్యానంద'
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక వేధింపులు, చిన్నారుల అపహరణ వంటి నేరాలతో ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి (Nithyananda) ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.
అయితే తాజాగా, ఆయన దృష్టి దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాపై పడినట్లు తెలుస్తోంది.
అక్కడ భూసేకరణకు (Land Grabbing) సంబంధించి ఆయన అనుచరులు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో, స్థానిక తెగలతో భూమి లీజుకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో, బొలీవియా ప్రభుత్వ అధికారులు కైలాస అనుచరులుగా పేర్కొన్న 20 మందిని అరెస్టు చేసి, వారి స్వదేశాలకు పంపించారు.
వివరాలు
వెయ్యి సంవత్సరాల లీజుతో పాటు గగనతల వినియోగం, సహజ వనరుల తవ్వకం
ఇటీవల కైలాస అనుబంధ వ్యక్తులు బొలీవియాలో పర్యటించారని సమాచారం.
అక్కడ కార్చిచ్చు వల్ల తీవ్రంగా నష్టపోయిన స్థానిక ప్రజలకు సహాయం చేయడం ద్వారా వారి నమ్మకాన్ని పొందిన వీరు, ఆ ప్రాంత భూమిపై కన్నేశారు.
లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా, బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తోనూ కైలాస ప్రతినిధులు కలిసి ఫొటోలు దిగారు.
ఈ చర్చల్లో, ఒక ప్రాంతాన్ని (దిల్లీ కంటే మూడు రెట్లు పెద్దదని అంచనా) 25 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందిగా ఒక తెగ ప్రతినిధి అంగీకరించాడు.
అయితే, కైలాస ప్రతినిధులు వెయ్యి సంవత్సరాల లీజుతో పాటు గగనతల వినియోగం, సహజ వనరుల తవ్వకం వంటి అధిక హక్కులను కోరారని సమాచారం.
వివరాలు
పరిశోధనాత్మక కథనం ప్రచురించిన బొలీవియా ప్రముఖ వార్తా పత్రిక
ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే, బొలీవియా ప్రముఖ వార్తా పత్రిక ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది.
దీంతో, అక్కడి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కైలాస అనుచరులుగా భావించిన 20 మందిని అదుపులోకి తీసుకుని, వారు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసింది.
అనంతరం, వారిని వారి స్వదేశాలకు (భారత్, చైనా, అమెరికా) పంపించింది.
బొలీవియా ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు పర్యాటకుల వేషంలో అనేకసార్లు దేశంలోకి ప్రవేశించి, స్థానిక తెగలతో సంబంధాలను పెంచుకుని భూసేకరణ ప్రయత్నాలు చేపట్టారని గుర్తించారు.
గత నవంబర్ నుంచే కొందరు అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నించారని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
"కైలాస" ఎక్కడ ఉందన్నది ఇప్పటికీ స్పష్టత లేదు
ఈ పరిణామాల నేపథ్యంలో, బొలీవియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, వివాదాస్పద "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస"తో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారతదేశం విడిచి పారిపోయిన నిత్యానంద, "కైలాస" అనే పేరు కలిగిన ప్రాంతంలో తన స్వంత రాజ్యం స్థాపించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే, "కైలాస" ఎక్కడ ఉందన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలో ఉన్న ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి "కైలాస" అని నిత్యానంద నామకరణం చేశాడని గతంలో పేర్కొన్నాడు.
తాజాగా, ఓ కేసుకు సంబంధించి, తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు పేర్కొంది.