USA: దిగ్బంధనం ప్రభావం.. 21 నౌకలను వెనక్కి పంపిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలపై యూఎస్ దిగ్బంధనం కొనసాగుతోంది. ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 21 నౌకలను వెనక్కి పంపినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచిన నేపథ్యంలో ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అమెరికాకు చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ USS మైఖేల్ మర్ఫీ అరేబియా సముద్రంలో చురుకుగా గస్తీ కాస్తోందని సెంట్కామ్ తెలిపింది. ఇరాన్ పోర్టులకు వెళ్లేందుకు లేదా అక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న నౌకలను సమర్థంగా అడ్డుకుంటున్నామని వెల్లడించింది.
వివరాలు
ఇరాన్ నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుంది
తమ ఆదేశాలకు లోబడుతూ ఇప్పటివరకు 21 నౌకలు వెనుదిరిగినట్లు పేర్కొంది. ఈ పరిణామాలతో హోర్ముజ్ జలసంధి అంశంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించడంతో వాణిజ్య నౌకల రాకపోకలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించినప్పటికీ, ఇరాన్ నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.