LOADING...
India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్‌ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!
అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్‌ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!

India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్‌ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ సంభాషణ అనంతరం అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌పై విధించిన సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ముసాయిదాను కూడా అమెరికా విడుదల చేసింది. గతంలో భారత్‌పై జరిమానాగా విధించిన 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత స్ట్రాంగ్‌గా మారాయి.

Details

అమెరికా మరో కీలక నిర్ణయం

ఇదే వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్‌కు అనుకూలంగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పంద చట్రంలో భాగంగా కాశ్మీర్‌ మ్యాప్‌తో కూడిన భారతదేశ చిత్రపటాన్ని అమెరికా విడుదల చేసింది. జమ్ముకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టంగా పేర్కొంటూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ చర్యతో కాశ్మీర్ అంశంలో భారత్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటించినట్లైంది. దీంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు అమెరికా గట్టి సందేశం పంపినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Details

దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది

జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. అయితే తాజా పరిణామాలతో పాకిస్థాన్‌కు భారీ షాక్‌ తగిలినట్లైంది. పాకిస్థాన్‌కు అత్యంత విశ్వసనీయ మిత్రదేశాల్లో ఒకటిగా భావించే అమెరికా, కాశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు, పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)ను కూడా భారతదేశంలో భాగంగానే చూపిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఒక ఫొటోను విడుదల చేయడం గమనార్హం.

Advertisement

Details

దాయాది దేశానికి భారీ ఝలక్

ఈ చర్యతో పాకిస్థాన్‌కు అమెరికా గట్టిగానే బుద్ధి చెప్పినట్టైంది. ఇటీవల కాలంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికాతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ, వారి వాదనలను పక్కనపెట్టి భారత్‌కు అనుకూలంగా అమెరికా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా విడుదల చేసిన భారతదేశ మ్యాప్‌తో దాయాది దేశానికి భారీ ఝలక్‌ ఇచ్చినట్టేనని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement