Raja Krishnamurthy: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి, ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభలో మరోసారి ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రిక్‌పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి గెలిచారు. 2016లో మొదటిసారి ప్రతినిధుల సభకు ఎన్నికైనప్పటి నుంచి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. కృష్ణమూర్తి, చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన ఆయన ఇల్లినోయీలో స్టేట్ ట్రెజరర్ వంటి కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది.
ఇల్లినోయీ రాష్ట్రంలో కమలా హారిస్ కు పూర్తి మద్దతు
ఇప్పటికీ ఇల్లినోయీ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ బలంగా నిలబడింది. ఈసారి రాష్ట్రం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు పూర్తి మద్దతుగా నిలిచింది. మొత్తం 14 ఎలక్టోరల్ ఓట్లు హారిస్‌కు లభించనుండగా, ఆమెకు 19,98,342 ఓట్లు రాగా, ట్రంప్‌కు 14,66,112 ఓట్లు మాత్రమే వచ్చాయి. కమలాను గెలుపొందినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ ధ్రువీకరించింది.