Gaza Conditions: ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
నాలుగు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌లోని పరిస్థితులను "నరకం"గా అభివర్ణించారు.ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పాలక మండలి సమావేశంలో ఆయన కోరారు. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను చూశారు. 1998-2000 సరిహద్దు యుద్ధంలో ఎరిట్రియాతో బాంబు దాడుల సమయంలో తన పిల్లలు బంకర్‌లో దాక్కున్నారని తెలిపారు.
గాజా స్ట్రిప్‌లో 25,000 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్‌లో 25,000 మందికి పైగా మరణించారని తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై గాజా దాడి తరువాత, ఇజ్రాయెల్ హమాస్‌పై పూర్తి స్థాయి ప్రతిఘటనను ప్రారంభించింది. అప్పుడు,ఈ దాడిలో 1,200 మంది మరణించగా, 200 మందికి పైగా బందీలను హమాస్ తిరిగి గాజా స్ట్రిప్‌కు తీసుకువెళ్లిందని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ యుద్దాలు ఎలాంటి పరిష్కారం ఇవ్వవని అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, అంటు రోగాలతో మరింత మంది చనిపోతారు అంటూ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.