Britain Royal Family: రాజ కుటుంబం భవనంలో దొంగతనం కలకలం.. క్యాజిల్ భద్రతపై ప్రశ్నలు
బ్రిటన్‌లో అత్యంత భద్రత కలిగిన రాజ కుటుంబానికి చెందిన విండ్సర్ క్యాజిల్‌లో దొంగతనం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ఇది భద్రతా వ్యవస్థలపై ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఎస్టేట్ పరిసరాల్లో ఫెన్సింగ్‌ను దాటుకొని దొంగలు లోపలికి చొరబడ్డారు. దొంగలు ట్రక్కు, బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు ఆ క్యాజిల్‌లో లేరని తెలిసింది. విండ్సర్ క్యాజిల్ రాజ కుటుంబ సభ్యుల విశ్రాంతి కోసం ఉపయోగించే ప్రదేశం కావడంతో ఎల్లప్పుడూ కఠినమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ దొంగతనం జరగడంపై భద్రతా వైఫల్యాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం క్యాజిల్ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్న భద్రతా విభాగం
విండ్సర్ క్యాజిల్ వంటి భద్రతా ప్రాంతాల్లో దొంగతనం జరగడం అనేది సామాన్యమైన విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ రాజ కుటుంబం స్పందించకపోయినా, భద్రతా విభాగం ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోంది. రాజ కుటుంబ సభ్యులు, వారి ఆస్తుల భద్రతను మరింత పటిష్ఠంగా రూపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటన బ్రిటన్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా విందసర్ క్యాజిల్ భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.