Page Loader
Iran-US: 'ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం లేదు'.. ఇరాన్‌ స్పష్టీకరణ
ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం లేదు'.. ఇరాన్‌ స్పష్టీకరణ

Iran-US: 'ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం లేదు'.. ఇరాన్‌ స్పష్టీకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌పై జరిగిన హత్యాయత్నాలు ఆగరాజ్యంలో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ ఘటనల వెనుక ఇరాన్‌ హస్తం ఉందన్న ఆరోపణలతో అప్పట్లో పెద్ద దూమారం చెలరేగింది. ఇరాన్‌ ఈ విషయంపై తాజాగా స్పందించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టమైన సందేశం పంపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో పేర్కొంది. ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో రెండు సార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు తీవ్రమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఇరాన్‌ అమెరికాలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది.

Details

హింసకు తాము వ్యతిరేకం : ఇరాన్

ఈ ప్రయత్నాల వెనుక, 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం టెహ్రాన్‌కు గట్టి హెచ్చరికలు చేసింది. ట్రంప్‌ హత్యాయత్నం యుద్ధానికి దారితీసే చర్యగా పరిగణించాల్సి వస్తుందని ఇరాన్‌ను హెచ్చరించింది. ఇరాన్‌ అక్టోబరులో అమెరికాకు ఒక సందేశం పంపిందని న్యూయార్క్‌ టైమ్స్‌ ధ్రువీకరించింది. అందులో సులేమానీ హత్య నేరపూరిత చర్య అని, కానీ తాము హింసాత్మక మార్గాన్ని అనుసరించమన్నారు. అంతర్జాతీయ న్యాయపరమైన మార్గాల్లోనే న్యాయాన్ని కోరతామని, ట్రంప్‌ను హత్య చేయాలని ఉద్దేశం తమకు లేదని చెప్పింది.

Details

ఎఫ్‌బీఐ దర్యాప్తు 

ఈ సందేశం టెహ్రాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల ప్రకారమే వచ్చినట్లు సమాచారం. ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించి అమెరికా ఎఫ్‌బీఐ ఇద్దరు అమెరికా పౌరులను అదుపులోకి తీసుకుంది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) అధికారి సూచనలతో ఫర్హాద్‌ షకేరీ అనే వ్యక్తి ఈ కుట్రను అమలు చేయడానికి ఇద్దరిని నియమించినట్లు తెలిపారు. ట్రంప్‌ హత్యాయత్నాల చుట్టూ ఉన్న వివాదాలు, ఇరాన్‌ ప్రకటనలు, అగ్రరాజ్య హెచ్చరికలు.. ఇవన్నీ ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.