Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం..? వ్యక్తి అరెస్ట్..
అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అక్టోబర్ 12న మూడోసారి దాడి ప్రయత్నం జరిగింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని కోచెల్లా వ్యాలీ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ ర్యాలీ వెలుపల చెక్ పాయింట్ వద్ద అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని వేన్ మిల్లర్ (49) గా గుర్తించారు. మిల్లర్ నకిలీ ప్రెస్ పాస్ తో ట్రంప్ ర్యాలీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతన్ని చెక్ పాయింట్ వద్ద అడ్డగించారు. అతని వాహనం నమోదు చేయబడలేదని గమనించిన అధికారులు, వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో లోడ్ చేసిన తుపాకీ, నకిలీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
5,000 డాలర్లు కట్టించుకొని బెయిల్ మంజూరు
రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ చాడ్ బియాంకో ఈ ఘటన గురించి ఆదివారం మాట్లాడారు. "మేము మరొక హత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నామని భావిస్తున్నాం," అని ఆయన పేర్కొన్నారు. అనంతరం వేన్ మిల్లర్ పై ఆయుధాల నిర్బంధం సహా పలు ఆరోపణలతో కేసు నమోదు చేశారు. మిల్లర్‌తో 5,000 డాలర్లు కట్టించుకొని బెయిల్ మంజూరు చేశారు, ఫెడరల్ ఏజెన్సీలు మాత్రం దీనికి సంబంధించి మరింత విచారణ జరుపుతున్నాయని సమాచారం.