లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం
లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తి భారీ ధరను పలికింది. లండన్‌లోని ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం సంస్థ 'బోన్‌హామ్స్' నిర్వహించిన వేలం పాటలో రూ.143 కోట్లకు విక్రయించారు. ఒక భారతీయ, ఇస్లామిక్ వస్తువుకు ఇంత ధర పలకడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. టిప్పు సుల్తాన్ స్వయంగా వినియోగించిన కత్తి కారణంగా దీని అనూహ్య ధర పలికినట్లు బోన్‌హామ్స్ సంస్థ తెలిపింది. టిప్పు సుల్తాన్ నిద్రపోయేటప్పుడు తన పడక దగ్గరే ఈ ఖడ్గాన్ని పెట్టుకునేవారని బోన్‌హామ్స్ చెప్పింది. అప్పట్లో దీన్ని జర్మన్ బ్లేడ్ డిజైన్‌ని ఉపయోగించి తయారు చేయడంతో ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది.
టిప్పు సుల్తాన్ వీరత్వానికి గుర్తుగా ఖడ్గాన్ని భద్రపర్చిన బ్రిటిషర్లు
టిప్పు సుల్తాన్ ఆయుధగారాల్లోని అద్భుతమైన ఖడ్గాల్లో ఇది ఒకటని బోన్‌హామ్స్ నిర్వాహకుడు ఒలివర్ వైట్ చెప్పారు. ఈ ఖడ్గానికి అసాధారణమైన చరిత్ర ఉందని, ఎంతో ప్రావీణ్యంతో దీన్ని తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. టిప్పు సుల్తాన్ నిద్రిస్తున్న సమయంలో తన పడక దగ్గరే ఈ కత్తిని పెట్టుకునేవారని వివరించారు. దాన్ని మొఘల్ ఖడ్గకారులు తయారు చేశారు. టిప్పు సుల్తాన్‌ను చంపిన తర్వాత, అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని వీరత్వానికి చిహ్నంగా భద్రపర్చినట్లు వేలం సంస్థ తెలిపింది. టిప్పు సుల్తాన్ 1782లో తన తండ్రి తర్వాత దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడిగా నియమితుడయ్యాడు.