అట్లాంటిక్ సముద్రంలో అణువణువు జల్లెడ పడుతున్నా దొరకని టైటాన్ ఆచూకీ.. ఆశలు గల్లంతు
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామిని వెతికి పట్టుకునేందుకు తీర రక్షక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. సముద్ర గర్భంలోని చివరి అడుగు వరకు అణువణువు జల్లెడ పడుతున్నా జాడ దొరకలేదు. క్షణక్షణం గడుస్తున్న కొద్దీ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ నిల్వలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 10 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో మాయమైన సబ్ మెరైన్ లోని ఆ ఐదుగురు సేఫ్ గా బయటకు వచ్చే అవకాశాలు దాదాపుగా మూసుపోయాయి. మినీ జలాంతర్గామి టైటాన్ నుంచి బుధవారం నీటి అడుగున శబ్దాలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో సబ్ మెరైన్ సురక్షితంగానే ఉందని అంతా అనుకున్నారు.
టైటాన్ తిరిగి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటం దాదాపు కష్టమే
కానీ ఎంత గాలిస్తున్నా ఆ మహాసముద్రంలో చిన్న జలాంతర్గామి అడ్రెస్ తెలియట్లేదు. టూరిస్ట్ టైటాన్ తిరిగి సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలదన్న ఆశలు సైతం గల్లంతయ్యాయి. కెనడా, అమెరికాకు చెందిన తీర రక్షక దళాలు సముద్రాన్ని తీవ్రంగా గాలిస్తున్నాయి. గత ఆదివారం గల్లంతైన టైటాన్ లో ప్రముఖులు ఉన్నారు. మినీ జలాంతర్గామిలో ఎవరెవరు ఉన్నారంటే : 1. పాక్ బిలియనీర్ షెహజాదా దావూద్ 2. దావూద్ కుమారుడు సులేమాన్ 3. యూఏఈలో ఉంటున్న బ్రిటన్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ 4. ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు, టూర్ నిర్వహకులు స్టాక్టన్ రష్ 5. ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ న్యూ ఫౌండ్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే టైటాన్ ఆచూకీ కనుమరగైపోయింది.