LOADING...
Gisborne: విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా? 
విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా?

Gisborne: విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రన్‌వేపై కొద్దిగా నీళ్లు పడినా విమానం ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అధికారులు తిరస్కరిస్తారు. కారణం, విమానం దిగే క్రమంలో టైర్లకు, రన్‌వేకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.. అలాంటప్పుడు ఒకే రన్‌వే మధ్యలో రైల్వే లైన్‌ ఉందని ఊహించగలరా? సాధారణంగా రైలు వస్తున్నప్పుడు, దాని మార్గాన్ని దాటే వాహనాలను తాత్కాలికంగా ఆపేస్తారు. కాని ఇక్కడ మాత్రం, విమానం వస్తుంటే రైలునే నిలిపివేస్తారు! ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది కల కాదు, నిజమే. ప్రపంచంలో ఇలాంటి వింతలు ఉన్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌ న్యూజిలాండ్ లోని గిస్‌బోర్న్‌ విమానాశ్రయం.

వివరాలు 

న్యూజిల్యాండ్‌ ఉత్తరద్వీపంలో గిస్‌బోర్న్‌

ఈ ఎయిర్‌పోర్ట్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి రన్‌వేను రెండు ముక్కలు చేస్తున్నట్లుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్‌ ఉంది. అంటే, ఒకే చోట రైల్వే సేవలు, విమానయాన కార్యకలాపాలు రెండిటికి వినియోగిస్తున్నారు. గిస్‌బోర్న్‌ అనే పట్టణం న్యూజిల్యాండ్‌ ఉత్తరద్వీపంలో ఉంది. ఇది సుమారు 160 హెక్టార్ల విస్తీర్ణలో ఉన్న చిన్న నగరంగా చెప్పవచ్చు. అక్కడి గిస్‌బోర్న్‌ ఎయిర్‌పోర్ట్‌ ఈ అద్భుత సదుపాయం వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే పాల్మెరస్టన్‌ నార్త్‌ నుంచి గిస్‌బోర్న్‌ వరకు వెళ్లే రైల్వే లైన్‌ నేరుగా ఈ విమానాశ్రయ రన్‌వే పైగానే వెళ్తుంది. ఈ విమానాశ్రయం ప్రతి రోజు ఉదయం 6:40 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే కార్యకలాపాల కోసం తెరిచి ఉంటుంది.

వివరాలు 

రన్‌వే మీదుగా రైల్వేలైన్‌ వెళ్తున్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌గా గిస్‌బోర్న్‌

అంతేకాక, ఇక్కడి సిగ్నలింగ్‌ వ్యవస్థను విమానాశ్రయ సిబ్బందే నేరుగా పర్యవేక్షిస్తారు. విమానం ల్యాండింగ్‌ లేదా టేకాఫ్‌ దశలోకి వస్తే, తాత్కాలికంగా రైళ్ల రాకపోకలు ఆపివేస్తారు. విమానాలకు మొదటి ప్రాధాన్యత ఇక్కడ. అలాగే, రైళ్లు,విమానాలు ఒకే సమయానికి రాకుండా ఉండేందుకు సమయ పట్టికను ముందుగానే సమన్వయం చేస్తారు. అయితే చిన్నచిన్న మార్పులు అప్పుడప్పుడూ సహజమే. ఇటువంటి ఏర్పాట్లు ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఇదేతరహా ఎయిర్‌పోర్టు ఉండేది. అక్కడ వైన్‌యార్డ్‌ అనే విమానాశ్రయం మధ్యలోనూ రైల్వే లైన్‌ వెళ్లేది. కానీ, 2005లో ఆ మార్గంలో రైలు సేవలు నిలిపేయడంతో, ఇప్పుడు ప్రపంచంలోనే రన్‌వే మీదుగా రైల్వేలైన్‌ వెళ్తున్న ఏకైక ఎయిర్‌పోర్ట్‌గా గిస్‌బోర్న్‌ నిలిచింది.