North Korea: చెత్త బుడగలు పంపిన ఉత్తరకొరియా.. దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటం
ఉత్తర కొరియా పంపించే చెత్తతో నింపిన బుడగలు తొలుత చిన్న సమస్యగా భావించారు. అయితే, అవి దక్షిణ కొరియాలో వైమానిక రంగానికి తీవ్రమైన ఆందోళనగా మారాయి. జూన్ నుంచి, తమ రాజధాని సియోల్‌లోని రెండు విమానాశ్రయాలలో ఈ బుడగల వల్ల రన్‌వేలను పలుమార్లు మూసివేయాల్సి వచ్చిందని ఆ దేశ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్‌పోర్టుల్లో కొన్ని లేదా మొత్తం రన్‌వేలను దాదాపు 20 రోజుల పాటు మూసివేయాల్సి వచ్చిందని,ఆ సమయంలో టేకాఫ్‌లు,ల్యాండింగ్‌లు సమస్యాత్మకంగా మారాయని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ బూ నామ్ పేర్కొన్నారు. మొత్తం 413 నిమిషాలు(ఆరు గంటలకు పైగా)తమ వైమానిక సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
90 నిమిషాల అంతరాయం
ఇచియాన్ ప్రపంచంలో ఐదో అత్యంత బిజీగా ఉండే ఎయిర్‌పోర్టుగా గుర్తించబడింది. మే చివరి వారంలో,ఉత్తరకొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగులతో కట్టిన బుడగలను దక్షిణ కొరియాలో వదులుతోంది. ఈ బుడగల సంఖ్య 5,500ను దాటేసిందని అంచనా.ఈ బుడగలలో ప్రచార కరపత్రాలు కూడా ఉన్నాయి. ఈ బుడగలు ఒక దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా కూలి సంచలనం సృష్టించాయి.జూన్ 26న, ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే దాదాపు మూడు గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది. అలాగే, సోమవారం మరో 90 నిమిషాల అంతరాయం కూడా జరిగింది. గింపో ఎయిర్‌పోర్టులో దేశీయ విమానాలు నడుపుతారు. ఉత్తరకొరియా చెత్త బుడగల కారణంగా ల్యాండింగ్‌లో ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో ఎక్కువ ఇంధనం అవసరం అవుతోంది.
బుడగల కారణంగా దెబ్బతిన్న కార్లు, ఆస్తులు
మే నెల నుంచి, దాదాపు 2,000 బుడగలను పంపినట్లు తెలుస్తోంది. వీటి బాగ్‌లలో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, పేపర్ వంటి చెత్త ఉంది. కొన్ని బుడగలలో మురుగుమట్టి, జంతు విసర్జన కూడా ఉంది. 2016లో కిమ్ ప్రభుత్వం బుడగలు పంపగా, వాటి కారణంగా దక్షిణ కొరియాలో కొన్ని కార్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి.