
Earthquake: రష్యాలో మళ్లీ ప్రకంపనలు.. 7.0 తీవ్రతతో భూకంపం నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని కురిల్ దీవుల ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో నమోదయ్యాయి. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖతో పాటు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సంస్థలు ధృవీకరించాయి. భూకంపానికి వెంటనే స్పందించిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ, పలు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకంపనల ప్రభావంతో పలు నగరాల్లో భవనాలు ఊగిపోతుండగా, భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Details
ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన రాలేదు
అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. ఇటీవలే కమ్చట్కా ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇది 2011 తర్వాత పసిఫిక్ ప్రాంతంలో నమోదైన అతిపెద్ద భూకంపంగా నిపుణులు భావిస్తున్నారు. ఆ భూకంపం ప్రభావమే తాజాగా కురిల్ దీవుల్లో ప్రకంపనలకు కారణమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Details
అగ్నిపర్వతం బద్దలు
రష్యాలో భారీ భూకంపం అనంతరం ప్రకృతి విలయం కొనసాగుతోంది. కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలయిందని స్థానిక మీడియా నివేదించింది. రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ప్రకారం, సుమారు 600 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం మళ్లీ క్రియాశీలంగా మారింది. ఈ విస్ఫోటనంతో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఆకాశంలోకి ఎగిసింది. అంతేకాదు, మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా గుర్తింపు పొందిన క్ల్యూచెస్కీ అగ్నిపర్వతం కూడా బద్దలైంది. ఇటీవలి భూకంపాలు ఈ అగ్నిపర్వతాలపై తీవ్ర ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు.