Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇజ్రాయెల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గాజాలో మహిళలు, పిల్లల హత్యలకు ఇజ్రాయెల్ కారణమని ట్రూడో ఆరోపించారు. అలాగే ఈ హత్యలను వీలైనంత త్వరగా ఆపాలని డిమాండ్ చేశారు. కెనడా ప్రధాని చేసిన ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గాజాలో సంభవించిన మరణాలకు హమాస్ బాధ్యత వహిస్తుందని, ఇజ్రాయెల్ కాదన్నారు.
ట్రూడోకు కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన విషయాన్నిఈ సందర్భంగా నెతన్యాహు గుర్తు చేశారు. హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారని ఆయన చెప్పారు. హమాస్ యూదులను క్రూరంగా హింసించింది, శిరచ్ఛేదం చేసి, కాల్చివేసిందన్నారు. పౌరులను ఊచకోత కోసిందన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను బాధ్యులను చేయడం సరికాదని నెతన్యాహు అన్నారు. పౌరులను హమాస్ నుంచి రక్షించడానికి ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని, రక్షణ కల్పిస్తోందన్నారు. అలాగే హమాస్‌ను నిర్మూలించేందుకు సహకరించాలని ట్రూడోను నెతన్యాహు కోరారు. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సహాయం చేస్తోందని ప్రధాని నెతన్యాహు అన్నారు.