Canada: ట్రూడో నాయకత్వం పట్ల స్వపక్షంలోనే అసంతృప్తి.. రాజీనామా చేయాలనీ డిమాండ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆయన స్వపక్షంలోనే అసంతృప్తి భగ్గుమంది. 24 మంది లిబరల్ సభ్యులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఆ పార్టీ ఒక క్లోజ్డ్‌డోర్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ట్రూడో వైఖరి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారని సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంపై ట్రూడో సన్నిహితుడిగా పేరుగాంచిన ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ, "ఇది చాలా కాలంగా జరుగుతున్న విషయం. ప్రజలు దీనిని బయటపెట్టడం అవసరం. ఎన్నికల్లో ఏమి జరిగిందో ఎంపీలు నిజాయితీగా ప్రధానికి చెప్పారు. ఆయనకు వినడం ఇష్టం ఉన్నా లేకపోయినా వారు మాత్రం చెప్పేశారు'' అని పేర్కొన్నారు.
ట్రూడో రాజీనామా.. 24 మంది సంతకాలు
ట్రూడో రాజీనామా చేయాలని కోరుకునే లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఇది మరింత సవాలుగా మారుతుంది. జూన్, సెప్టెంబర్ ఎన్నికల్లో లిబరల్స్ కీలకమైన రెండు స్థానాలను కోల్పోయారు. అదేవిధంగా, పార్టీ వచ్చే ఎన్నికలకు చేయాల్సిన సన్నాహాలు కూడా దారుణంగా ఉన్నాయని ఎంపీలు అభిప్రాయపడ్డారు. పార్టీ ఎంపీ ఎరిస్కిన్ స్మిత్ మాట్లాడుతూ, "చూడండి, ట్రూడోకు పరిస్థితులను సరిదిద్దడానికి ఇంకా సమయం ఉంది. మీ సహచరులు అసంతృప్తి వ్యక్తంచేసినప్పుడు, దానిని వినడం చాలా ముఖ్యమని" అన్నారు.
న్యూడెమోక్రాట్స్‌కు 21శాతం మంది సానుకూలం
చాలాకాలం పాటు లిబరల్స్‌తో కలిసి ప్రభుత్వాన్నినడిపించిన ఎన్‌డీపీ కూడా ఈసారి బ్రిటిష్ కొలంబియా ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడ కన్జర్వేటివ్ పార్టీ అనుకోని స్థాయిలో బలపడింది.ఇటీవల నానోస్ రీసెర్చి సర్వేలో అక్టోబర్ 15 నాటికి ప్రజల్లో 39శాతం మద్దతు కన్జర్వేటివ్ పార్టీకి ఉండగా,లిబరల్స్‌కు కేవలం 23శాతం మాత్రమే ఉందని వెల్లడైంది. ఇక న్యూడెమోక్రాట్స్‌కు 21శాతం మంది సానుకూలంగా ఉన్నట్లు తేలింది. ఖలిస్థానీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని భారత ప్రభుత్వ ఏజెంట్లు పనిచేస్తున్నారని,వారికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులతో సంబంధాలున్నాయని కెనడా ఆరోపించింది . ఈ ఆరోపణలకు సంబంధించి కేవలం తమ వద్ద నిఘా సమాచారం మాత్రమే ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల అంగీకరించారు. ఈ ఆరోపణలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.