Iran Crisis: అమెరికా షాక్.. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌కు అమెరికా నుంచి షాక్ ఇచ్చే ప్రకటన వెలువడింది. గత రెండు వారాలకుపైగా ఇరాన్‌లో పౌరులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ, తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌తో అధిక స్థాయిలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్న దేశాల్లో చైనా, టర్కీ, యూఏఈ, ఇరాక్, భారత్ ముఖ్యమైనవిగా ఉన్నాయి.
వివరాలు
నిరసనలలో సుమారు 600 మంది వరకు మృతి
ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో అమెరికా సైనిక చర్యలకు దిగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, ఇరాన్‌పై చర్యల్లో భాగంగా వైమానిక దాడులు కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉండవచ్చని పేర్కొనడం గమనార్హం. ఇక ఇరాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో గత నెల 28వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు సుమారు 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.