
Trump: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్.. పన్ను మినహాయింపు రద్దు చేయాలని నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
హార్వర్డ్ యూనివర్శిటీపై చర్యలు తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఇప్పటికే హార్వర్డ్‌కు ఇచ్చే సుమారు 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ సహాయాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే.
తాజాగా, విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును రద్దు చేయాలనే ఆదేశాలను ట్రంప్ రెవెన్యూ విభాగానికి ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
ఇందుకు సంబంధించి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS)కు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
వివరాలు
2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా..
ఇదిలా ఉండగా, హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతంపై వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, హమాస్‌కు మద్దతుగా పరోక్షంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని ఇటీవల వైట్‌హౌస్ ఆరోపించింది.
జో బైడెన్ అధ్యక్షతన అమెరికాలోని అనేక విద్యాసంస్థల్లో హమాస్‌కు అనుకూలంగా ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీ 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సాధారణంగా యూనివర్సిటీలకు పన్ను మినహాయింపులను రద్దు చేయడం చాలా అరుదుగా కనిపించే అంశం.
వివరాలు
అదే పరిస్థితి హార్వర్డ్‌ను కూడా ఎదుర్కొంటుందా?
అయినప్పటికీ, హార్వర్డ్ విషయంలో మాత్రం ట్రంప్ గంభీరంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
దీనికోసం సంబంధిత అధికారులను ఆయన ఇప్పటికే ఆదేశించినట్టు సమాచారం.
ఉగ్రవాద సంబంధాలు, రాజకీయ లక్ష్యాలు, సైద్ధాంతిక దృక్పథాల ఆధారంగా పనిచేసే విద్యాసంస్థలకు పన్ను మినహాయింపులు కల్పించడం అనుచితమని,అలాంటి ప్రయోజనాలను రద్దు చేయాల్సిందేనని ట్రంప్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ఇంతవరకు ట్రంప్ ఆదేశాలపై హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
కానీ ఒకవేళ పన్ను మినహాయింపు రద్దయితే అది చాలా అరుదైన,అసాధారణ ఘటనగా నిలుస్తుంది.
ఇలాంటి పరిణామం చివరిసారిగా 1980లో ఒక క్రైస్తవ కళాశయం విషయంలో చోటుచేసుకుంది, అప్పుడు జాతివివక్షను ఆధారంగా చేసుకొని ఆ మినహాయింపును రద్దు చేశారు.
ఇప్పుడు అదే పరిస్థితి హార్వర్డ్‌ను కూడా ఎదుర్కొంటుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
వివరాలు
ట్రంప్ ప్రభుత్వం కసరత్తు
సాధారణంగా పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు,లాభాపేక్షలేని సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
అయితే రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొన్నట్లు నిరూపితమైతే, ఆ హక్కును కోల్పోయే అవకాశముంటుంది.
2024 ఎన్నికల సమయంలో హార్వర్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.