
Los Angeles:లాస్ ఏంజెలెస్‌లో మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ మోహరింపు
ఈ వార్తాకథనం ఏంటి
లాస్ ఏంజెలెస్ నగరంలో అక్రమ వలసదారుల అరెస్టుతో ఉద్రిక్తతలు ముదిరాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలో నిఘా పెంచేందుకు ఆయన అదనంగా 2 వేల నేషనల్ గార్డులను మోహరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. ట్రంప్ ఆదేశాల మేరకు మరో రెండు వేల నేషనల్ గార్డులను లాస్ ఏంజెలెస్‌కు తరలిస్తున్నట్టు ఆయన ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అక్కడ ఉన్న నేషనల్ గార్డులకు తోడుగా, ఇమిగ్రేషన్ అధికారులు, వారి ఆస్తులను రక్షించేందుకు రక్షణ శాఖ 700 మంది మెరైన్‌లను పంపిన విషయం తెలిసిందే.
వివరాలు
గవిన్ న్యూసమ్‌ను అరెస్టు చేయాలి!
ఇదిలా ఉండగా.. ఈ చర్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పలు యుద్ధాల్లో సేవలందించిన మెరైన్‌లను, ఇప్పుడు తాము నివసిస్తున్న దేశపు పౌరులపై మోహరించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని న్యూసమ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, అమెరికా ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డు తగిలేవారు ఎవరైనా అరెస్టు చేయాలని బోర్డర్ జార్ టామ్ హోమన్ హెచ్చరికలు జారీ చేశారు. ఓ జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలపై ట్రంప్‌ను ప్రశ్నించగా, తాను టామ్ స్థానంలో ఉన్నా అదే చేసేవాడినని ట్రంప్ సమాధానమిచ్చారు. గవిన్ న్యూసమ్‌కు ప్రజలలో పాపులారిటీ పెరగడం నచ్చుతోందంటూ ఎద్దేవా చేశారు.
వివరాలు
గవిన్ న్యూసమ్‌ను అరెస్టు చేయాలి!
లాస్ ఏంజెలెస్‌లో చెలరేగుతున్న అల్లర్లను అదుపులోకి తేవడానికి నేషనల్ గార్డులను మోహరించామని ట్రంప్ తెలిపారు. ఇది చేయకపోతే నగరమే విధ్వంసమయ్యేదని ఆయన అన్నారు. అయినా న్యూసమ్,లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమకు కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయంలో, బదులుగా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు.