Donald trump: 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంస్థలపై ఉగ్రముద్రకు చర్యలు ప్రారంభించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రూప్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేందుకు చర్యలు ప్రారంభించారు. ట్రంప్ నిర్ణయంతో అరబ్ ప్రపంచంలో అత్యంత పురాతనంగా, విస్తృత ప్రభావం కలిగిన ఈ ఉద్యమం కఠిన ఆంక్షలకు లోనయ్యే అవకాశం ఉంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం..లెబనాన్,ఈజిప్టు,జోర్డాన్ వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్ అనుబంధ సంస్థలను ఎలాంటి విధానంలో ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలనేదాని పై నివేదిక ఇవ్వాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు మద్దతు
ఈ నేపథ్యంలో సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు ఇప్పటికే సంతకం చేసినట్టు వెల్లడించారు. నివేదిక అందిన 45 రోజుల్లోపే ఈ సంస్థలకు ఉగ్ర ముద్ర ఎలా వేయాలి, ఏ చర్యలు ప్రారంభించాలి వంటి అంశాలపై ముందుకెళ్లాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇజ్రాయెల్,అమెరికా మిత్రదేశాలకు వ్యతిరేకంగా హింసాత్మక దాడులకు ఈ సంస్థలు ప్రోత్సాహం అందిస్తున్నాయని, మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు వీరు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పరిపాలన ఆరోపించింది. పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు మరియు మిత్ర దేశాలను అస్థిరపరచే విధంగా ముస్లిం బ్రదర్‌హుడ్ నెట్‌వర్క్ పనిచేస్తోందని, అందుకే దానిపై చర్యలు అవసరమని ఫ్యాక్ట్ షీట్ వివరించింది.
వివరాలు
బ్రదర్‌హుడ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నం
ముస్లిం బ్రదర్‌హుడ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రూబియో పేర్కొన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కూడా ఇదే దిశగా చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కూడా ఇటీవల ఈ సంస్థపై చర్యలు తీసుకున్నప్పటికీ, అవి రాష్ట్ర స్థాయికి మాత్రమే పరిమితమవుతున్నాయి. 1920లో ఈజిప్టులో స్థాపించబడిన ముస్లిం బ్రదర్‌హుడ్ ప్రధానంగా ఇస్లామిక్ సిద్ధాంతాలను విస్తరించడానికి ఏర్పడింది. కాలక్రమేణా అరబ్ దేశాల అంతటా వేగంగా విస్తరించిన ఈ సంస్థ రహస్యపద్ధతుల్లో పనిచేసే శైలి కోసం కూడా ప్రసిద్ధి చెందింది.