LOADING...
Trump: చార్లీ కిర్క్ హత్య.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. 'ఉగ్రవాద' గ్రూపుగా ఎంటిఫా
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. 'ఉగ్రవాద' గ్రూపుగా ఎంటిఫా

Trump: చార్లీ కిర్క్ హత్య.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. 'ఉగ్రవాద' గ్రూపుగా ఎంటిఫా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష సిద్ధాంతాన్ని అనుసరించే ఎంటిఫా (Antifa) అనే సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కన్జర్వేటివ్‌ ఉద్యమకారుడు చార్లీ కిర్క్‌ హత్య సంఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించారు. ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రంప్ స్పష్టంచేశారు. దానిని అత్యంత హానికరమైనదిగా, "రాడికల్ లెఫ్ట్ విపత్తు"గా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సంస్థకు నిధులు సమకూర్చే వారిని గుర్తించి కఠినంగా విచారించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు.

వివరాలు 

ఎంటిఫా అంటే ఏమిటి? 

'Antifa' అనేది "Anti-Fascist" అనే పదానికి సంక్షిప్త రూపం.ఇది ఒక నిర్దిష్టమైన అధికారిక సంస్థ కాదు. బదులుగా,ఇది ఫార్-లెఫ్ట్ భావజాలాన్ని అనుసరించే కార్యకర్తల సమూహం. వీరి ప్రధాన లక్ష్యం ఫాసిజం,జాతి వివక్ష,ముఖ్యంగా కన్జర్వేటివ్ ఆలోచనలను వ్యతిరేకించడం. ఈ గ్రూప్ సభ్యులు తరచుగా ఫార్-రైట్ ర్యాలీలను అడ్డుకోవడంలో, నిరసనలు నిర్వహించడంలో చురుకుగా ఉంటారు. వీరు తమ నిరసనల్లో 'బెల్లా సియావో' (Bella Ciao) పాటలు, 1917 రష్యా విప్లవానికి చెందిన గుర్తులు, నినాదాలను ఉపయోగిస్తుంటారు. అలాగే సిగ్నల్, ఇతర ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్ యాప్స్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించటం వీరి ప్రత్యేకత. ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనే ఎంటిఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని యోచించారు. కానీ అప్పట్లో అది సాధ్యంకాలేదు.

వివరాలు 

చార్లీ కిర్క్ హత్య 

ఇప్పుడు చార్లీ కిర్క్ హత్య అనంతరం ఆ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అయితే ఎంటిఫా అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దాన్ని ఒక నిర్దిష్ట సంస్థగా పరిగణించడం కష్టం అని, చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సెప్టెంబర్ 10న యుటా యూనివర్సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు. ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న కిర్క్,అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన కోసం చురుకైన ప్రచారం కూడా చేశారు.

వివరాలు 

టైలర్ రాబిన్సన్‌ అరెస్టు

కాబట్టి తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వారిని విడిచిపెట్టమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులు వామపక్ష భావజాలం కలిగిన 22 ఏళ్ల యువకుడు టైలర్ రాబిన్సన్‌ను అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" అని రాసి ఉన్న బుల్లెట్ కేసింగ్‌లు బయటపడటం విశేషం. అయితే రాబిన్సన్ నిజంగా ఎంటిఫాకు చెందినవాడా అనే విషయంలో ఎఫ్‌బీఐ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ''ఇంటర్నెట్ ద్వారా రాడికల్ భావజాలానికి లోనయ్యాడు'' అని బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనించదగ్గ అంశం.