Page Loader
Donald Trump: ట్రంప్ కాళ్ల 'సిరల లోపం' నిర్ధారణ.. దీర్ఘకాల సిరల వ్యాధిగా నిర్ధారణ
ట్రంప్ కాళ్ల 'సిరల లోపం' నిర్ధారణ.. దీర్ఘకాల సిరల వ్యాధిగా నిర్ధారణ

Donald Trump: ట్రంప్ కాళ్ల 'సిరల లోపం' నిర్ధారణ.. దీర్ఘకాల సిరల వ్యాధిగా నిర్ధారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాల సిరల వ్యాధి (వీనస్ ఇన్‌సఫీషియెన్సీ) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది సాధారణ రక్త ప్రసరణ సంబంధిత సమస్య అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. 70 ఏళ్ల పైబడిన వారిలో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో,ముఖ్యంగా చీలమండ వద్ద వాపు రావడంతో వైద్యులు పరీక్షించారు. వైద్య నిపుణులు దీన్ని సాధారణమైన సిరల లోపంగా గుర్తించారని, దీనితో ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇది 'డీప్ వీన్ థ్రోంబీసిస్' (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం) కూడా కాదు,అలాగే 'ఆర్టీరియల్ వ్యాధి' (దమనులు మూసుకుపోవడం) కాకపోవడం స్పష్టమైంది.

వివరాలు 

 ఆరోగ్యంగా  ట్రంప్ 

ఇతర వైద్య పరీక్షలలో ట్రంప్‌కు గుండె సంబంధిత సమస్యలు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఏవీ లేవని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని,అతనికి ఎలాంటి అసౌకర్యం లేదని తెలిపారు. తన ఆరోగ్యం విషయంలో పారదర్శకత ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు మీడియాకు వెల్లడిస్తున్నామని లీవిట్ తెలిపారు. ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయంలాంటిది కనిపించడం వల్ల ఆ ఫొటోలు మీడియాలో ప్రసారమయ్యాయి. దీనిపై లీవిట్ స్పందిస్తూ,ట్రంప్ తరచుగా ఇతరులతో కరచాలనం చేయడం, అలాగే ఆస్పిరిన్ వాడకంతో ఇలాంటి సమస్య ఏర్పడిందని వివరించారు. ప్రస్తుతానికి చికిత్స గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే అధ్యక్షుడి వైద్య బృందం దీనిపై నిఘా పెట్టి, అవసరమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

వివరాలు 

సిరల వాపు సమస్య అంటే ఏమిటి..? 

సాధారణంగా శరీరంలోని సిరలు రక్తాన్ని వివిధ భాగాల నుంచి గుండెకు పంపే పనిని నిర్వహిస్తాయి. ముఖ్యంగా కాళ్లలో లోతైన సిరలు ఉంటాయి. వీనస్ ఇన్‌సఫీషియెన్సీ అనేది కాళ్లలోని లేదా ఇతర శరీర భాగాల్లోని సిరలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏర్పడే సమస్య. సిరల్లో ఉండే కావాటాలు (వాల్వ్స్) సరిగ్గా పని చేయకపోవడం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి, కాళ్ల సిరలలో పేరుకుపోతుంది. దీని వల్ల అక్కడ వాపు, ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య కొనసాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

సాధారణంగా వ్యాయామంతో  అదుపులో 

ఎక్కువ సేపు నిలబడడం, ఎక్కువ సేపు కూర్చోవడం, వయస్సు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడే అవకాశముంది. ఇది సాధారణమైన సమస్యే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారుతుంది. సాధారణంగా వ్యాయామం చేయడం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం కూడా ఉంటుంది.