Trump-Gustavo Petro: కొలంబియా అధ్యక్షుడితో చర్చలకు ట్రంప్ సిద్ధం..
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన ఘటన తర్వాత, లాటిన్ అమెరికా దేశాలైన మెక్సికో, క్యూబా, కొలంబియాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంలో తాజాగా ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. గుస్తావో పెట్రోతో స్నేహపూర్వకంగా ఫోన్‌లో మాట్లాడామని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పలు విభేదాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరిగినట్లు చెప్పారు. అలాగే,త్వరలోనే గుస్తావోతో ప్రత్యక్ష భేటీ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
వివరాలు
నన్ను తీసుకెళ్లండి. నేను ఇక్కడే మీ కోసం ఎదురుచూస్తున్నాను
ఈ సమావేశం వైట్‌హౌస్‌లోనే జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మదురో నిర్బంధం తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలు మాదక ద్రవ్యాలను తయారు చేసి అమెరికాకు తరలిస్తున్నాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఈ విధానం మార్చుకోకపోతే, వెనెజువెలా ఎదుర్కొన్న పరిస్థితినే ఈ దేశాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఘాటుగా స్పందించారు. "నన్ను తీసుకెళ్లండి. నేను ఇక్కడే మీ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఆయన సవాల్ విసిరారు. తమ దేశంపై అమెరికా సైనిక చర్యకు దిగితే దాని ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని కూడా గుస్తావో స్పష్టం చేశారు.