Donald Trump Warning: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. 10 నిమిషాల్లో అణు సామర్థ్యాన్ని అంతం చేస్తాం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమపై ఎలాంటి దాడులకు పాల్పడినా, వాటి తీవ్రత ఎంత ఉన్నా దీటుగా బదులివ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తన సైన్యానికి పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఇరాన్ అణు సామర్థ్యాన్ని చాలావరకు ధ్వంసం చేశామని, ఇంకా రెండు లక్ష్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాము తలచుకుంటే కేవలం 10 నిమిషాల్లోనే ఇరాన్ అణు శక్తిని పూర్తిగా అంతం చేయగలమని ట్రంప్ హెచ్చరించారు. తమ లక్ష్యాల్లో పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) కూడా ఉందని స్పష్టం చేశారు. అయితే, మరోవైపు టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
వివరాలు
ఇరాన్ నాయకులను నమ్మలేం
ఇరాన్ నాయకులను మాత్రం తాను ఎప్పటికీ నమ్మలేనని వ్యాఖ్యానించారు.
అమెరికా ఎప్పుడు దాడులు చేయబోతోందని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారని, ఒకవేళ అదే రోజు దాడులు చేయాలని నిర్ణయించుకుంటే ముందుగానే అందరికీ చెప్పి చేస్తామా? అని ట్రంప్ ప్రశ్నించారు.
ఆయన వ్యాఖ్యలతో ఇరాన్‌పై అమెరికా తదుపరి చర్యలపై మరోసారి చర్చ మొదలైంది. ఇరాన్‌లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) అని పిలుస్తారు.
ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో ఉంది. ఇరాన్‌కు చెందిన కీలక అణు కేంద్రాల్లో ఒకటైన నతాంజ్ అణు సముదాయానికి ఈ పర్వతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివరాలు
అసలు ఏమిటీ పికాక్స్ పర్వతం?
ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఈ పర్వత ప్రాంతంలోని భూగర్భ కేంద్రానికి తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలో అంచనా వేశాయి.
ఈ కేంద్రంలో ఇప్పటికీ అణు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పికాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు.
ఈ స్థావరంపై అమెరికా దాడులకు దిగితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరిస్తోంది.
దీంతో పికాక్స్ పర్వతం ఇప్పుడు ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో కీలక ప్రాంతంగా మారింది.