Loading...
Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్
కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్

Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మిత్రదేశాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా దక్షిణ కొరియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సహకరించలేమని ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ చెప్పడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణకొరియా ప్రధాన శత్రువైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మాత్రం ప్రశంసలు కురిపించారు. కిమ్ జోంగ్ ఉన్ నుంచి దక్షిణకొరియాను రక్షించేందుకు అమెరికాకు చెందిన 39 వేల మంది సైనికులు అక్కడ ఉన్నారని ట్రంప్ గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ విషయంలో అమెరికాకు సహకరించబోమని దక్షిణకొరియా చెప్పడం తనకు ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సహకరిస్తారా..

దక్షిణకొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ట్రంప్ మీడియాకు వెల్లడించారు.

ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సహకరిస్తారా అని తాను లీని అడిగినట్లు చెప్పారు.

అందుకు ఆయన సహాయం చేయడం సాధ్యం కాదని సమాధానం ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత లీతో జరిగిన సంభాషణను వివరిస్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

''ఒక్క నిమిషం ఆగండి.. కిమ్ జోంగ్ ఉన్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. కిమ్ మీకు అత్యంత సమీపంలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఇరాన్ విషయంలో అమెరికాకు సహాయం చేయబోమని మీరు చెప్పడం వింతగా ఉంది'' అని తాను అన్నట్లు వెల్లడించారు.

వివరాలు 

అమెరికాకు దక్షిణకొరియా సహాయం అవసరం లేదు: ట్రంప్

అయితే అమెరికాకు ప్రస్తుతం దక్షిణకొరియా సహాయం అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

అదే సమయంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు సహకరించని మిత్రదేశాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా భారీ ఆర్థిక భారాన్ని ఎందుకు భరించాలనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

అమెరికా వనరులు, సైనిక బలగాలను మిత్రదేశాల రక్షణ కోసం వినియోగిస్తున్నప్పుడు తమకు కూడా సహకారం అందాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దక్షిణకొరియాతో అమెరికా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని తమ రక్షణశాఖను ఆదేశించినట్లు ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.

ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న సంబంధం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

కిమ్ జోంగ్ ఉన్‌పై ట్రంప్ మరోసారి ప్రశంసలు

ఇదే సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌పై ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.

కిమ్ తనను ఎప్పుడూ గౌరవంగా చూస్తారని చెప్పారు. తామిద్దరం రెండుసార్లు సమావేశమయ్యామని, ఆ భేటీల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా సహా పలువురు నేతలు కిమ్‌కు నచ్చరని ట్రంప్ అన్నారు.

అయితే తనకు, కిమ్‌కు మధ్య మాత్రం మంచి స్నేహం ఏర్పడిందని పేర్కొన్నారు.

దక్షిణకొరియాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే కిమ్‌తో తన స్నేహాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT