
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియమితులయ్యారు.
గురువారం అమెరికా సెనెట్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా కాశ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికన్లకు హాని చేయాలని యత్నించే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
"ఎఫ్‌బీఐ తొమ్మిదో డైరెక్టర్‌గా నియమితులవడం నాకు గౌరవంగా ఉంది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి నా కృతజ్ఞతలు.ఎఫ్‌బీఐ గొప్ప చరిత్రను కలిగి ఉంది.ప్రజల పట్ల పారదర్శకంగా,జవాబుదారీగా వ్యవహరించేలా బ్యూరో కట్టుబడి ఉంది.అమెరికా గర్వించదగిన విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం.అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే వారి అంతు చూస్తాం"అని పటేల్ పేర్కొన్నారు.
వివరాలు
ట్రంప్‌కు అత్యంత నమ్మకస్థుడిగా కాశ్‌కు పేరు
అయితే, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ పేరును అలాస్కాకు చెందిన రిపబ్లికన్‌తో పాటు కొంతమంది డెమోక్రాట్లు వ్యతిరేకించారు.
అయినప్పటికీ 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం ధ్రువీకరించబడింది.
దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్‌గా కాశ్ పటేల్ గుర్తింపు పొందారు.
ట్రంప్‌కు అత్యంత నమ్మకస్థుడిగా కాశ్‌కు పేరు ఉంది. ఆయన గుజరాత్‌లో కుటుంబ మూలాలున్నాయి.
అయితే, ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు.
కాశ్ తండ్రి ఉగాండాలో నివసించేవారు, కానీ నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో కాశ్ పటేల్ జన్మించారు.
వివరాలు
మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా ఉద్యోగం
ఆయన యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను అభ్యసించారు.
న్యాయవాదిగా ఓ సంస్థలో పని చేయాలనుకున్నా అవకాశాలు రాలేదు.
ఈ నేపథ్యంలో మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించి, వివిధ హోదాల్లో సేవలు అందించారు.