Donald Trump: వియ్యంకులకు కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టబోతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్,ఈసారి తన ప్రభుత్వ కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన సన్నిహితులు, యువ నేతలను కీలక పదవుల్లో నియమించుకున్న ట్రంప్, ఇప్పుడు తన బంధువులను కూడా పాలకవర్గంలోకి తీసుకువచ్చారు. తన ఇద్దరి వియ్యంకులను కీలక బాధ్యతలతో నియమించారు. లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త మసాద్ బౌలోస్‌ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమించారు. ఈయన ట్రంప్‌కు స్వయానా వియ్యంకుడు. మసాద్ కుమారుడు మైఖెల్ టిఫానీని వివాహం చేసుకున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన సందర్భంలో ఈ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తెరవెనుక నుంచి కాబోయే అధ్యక్షుడికి సలహాలు
ట్రంప్ ఎన్నికల సమయంలో గాజా సంబంధిత అసంతృప్తిని సరిచేసి, అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లను తన వైపుకు మళ్లించడంలో మసాద్ కీలక పాత్ర పోషించారు. అలాగే, తన మరొక వియ్యంకుడైన ఛార్లెస్ కుష్నర్‌ను ఫ్రాన్స్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇవాంకా ట్రంప్ భర్త అయిన జారెడ్ కుష్నర్ తండ్రి అయిన ఛార్లెస్ గతంలో ఓ కేసులో దోషిగా తేలినా, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్షమాభిక్ష అందించి శిక్ష నుంచి బయటపడేశారు. ఈసారి ట్రంప్ పిల్లలు లేదా అల్లుడు జారెడ్ కుష్నర్ పాలకవర్గంలో ప్రత్యక్షంగా కీలక పదవులు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, వీరంతా తెరవెనుకే ఉండి, ట్రంప్‌కు సలహాలు అందిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.