Page Loader
Donald Trump: ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్‌ సిగ్నల్‌! 
ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్‌ సిగ్నల్‌!

Donald Trump: ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్‌ సిగ్నల్‌! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై దాడికి అమెరికా సైతం సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై బహిరంగంగా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోయినా, ఆయన అంతర్గతంగా దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పలు ప్రముఖ అంతర్జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

టెహ్రాన్ ఇప్పటికే అనేక పరిమితులను అతిక్రమించింది: ట్రంప్  

ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్ అంతర్గతంగా అంగీకరించినప్పటికీ,ఆయన ఇంకా తుది ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని వదులుకుంటుందేమోనని ఒక అవకాశంగా భావించి,కొంత సమయం ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఇటీవల విలేకరులతో మాట్లాడిన ట్రంప్,ఈ దాడుల అంశంపై మాత్రం స్పష్టంగా స్పందించలేదు. కానీ టెహ్రాన్ ఇప్పటికే అనేక పరిమితులను అతిక్రమించిందని పేర్కొంటూ,ఇప్పటివరకు స్పందించకపోవడం ఆలస్యం అయిందని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం ఈ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని, అంతకన్నా ముందే కూడా ఏదైనా సంభవించవచ్చని సూచించారు. అదే సమయంలో, ఇరాన్ వైపు నుంచి తమ మధ్య చర్చలు జరిపేందుకు ప్రతిపాదన వచ్చిందని తెలియజేశారు. అయితే, ఆ చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

అమెరికా జోక్యం చేసుకుంటే.. ఖబడ్దార్‌

ఇటీవల ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ ఎక్కడ ఉన్నారో అమెరికాకు తెలుసని వెల్లడించిన ట్రంప్, ప్రస్తుతానికి ఖమేనీలోను వదిలిపెట్టాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇరాన్ షరతులులేని విధంగా లొంగిపోవాలని, లేకపోతే పరిస్థితులు అనుకున్న దానికంటే తీవ్రంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఖమేనీ స్పందిస్తూ, అమెరికా బెదిరింపులకు తామేం భయపడబోమని స్పష్టం చేశారు. ఇరాన్ చరిత్రను బాగా తెలిసినవారు ఈ విషయం అర్థం చేసుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం నేరుగా జోక్యం చేసుకుంటే, దాని ప్రభావం తీవ్రంగా ఉండి, కోలుకోలేని నష్టాన్ని కలిగించే అవకాశముందని హెచ్చరించారు.

వివరాలు 

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ దాడులు 

ఈ క్రమంలో 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ తన దాడులను ప్రారంభించింది. టెల్‌అవీవ్ అధికారం అణుస్థావరాలపై ప్రధానంగా దాడులు సాగిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌లో పలువురు కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రతీకారంగా, ఇరాన్ కూడా టెల్‌అవీవ్‌పై క్షిపణి దాడులు చేసింది. దీంతో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి.