Donald Trump: మెక్సికో,కెనడా,చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను (Tariff) పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మెక్సికో (Mexico) కెనడా (Canada) నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల సరఫరా, అక్రమ వలసల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకం
''జనవరి 20న నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో భాగంగా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించడానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేస్తాను,'' అని ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా, చైనా (China) ఉత్పత్తులపై కూడా 10 శాతం సుంకం విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్టులో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు. ఆయన ఆర్థిక విధానాలలో సుంకాలు ముఖ్యమైన అంశంగా నిలుస్తాయి. ప్రచారంలో కూడా వివిధ దేశాల దిగుమతి ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కెనడా నుంచి వ్యతిరేక స్పందన
తాజా నిర్ణయం ఆ దిశగా తీసుకున్న తొలి అడుగుగా భావించవచ్చు. అయితే, ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించడాన్ని కెనడా నాయకుడు జిగ్మిత్ సింగ్ (Jagmeet Singh) తీవ్రంగా వ్యతిరేకించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కదలాలని, దేశ ప్రయోజనాల కోసం పోరాడాలని అయన ఎక్స్ వేదికగా , పిలుపునిచ్చారు.