
Student Visa: దేశీ విద్యార్థులపై మరో ఆంక్షల కత్తి.. 'సమయ పరిమితి'ని ప్రతిపాదించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై మరోసారి ఆంక్షల కత్తి వేలాడుతోంది. ఇప్పటికే విద్యార్థి వీసాల జారీ ప్రక్రియలో 'సోషల్ మీడియా వెరిఫికేషన్'ను కఠినంగా అమలు చేస్తున్న యూఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త నిబంధనను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, విద్యార్థుల వీసాలకు గడువు (టైమ్ లిమిట్) విధించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ యోచిస్తోంది. దీనివల్ల ఇప్పటికే అక్కడ ఉన్న లక్షల మంది విదేశీ విద్యార్థులలో ఆందోళన మొదలైంది.
వివరాలు
ఫిక్స్‌డ్ టైమ్ పీరియడ్‌తో కూడిన వీసాలనే మంజూరు చేయాలని ప్రతిపాదన
ప్రస్తుతం యూఎస్‌లో ఎఫ్-1 వీసాలతో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, అలాగే జే-1 వీసాలతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న వారు, 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' అనే సౌలభ్యాన్ని పొందుతున్నారు. అంటే వారు తమ కోర్సు ఎంతకాలం ఉన్నా, అంతవరకూ అమెరికాలో ఉండే హక్కు ఉంటుంది. ఇది విద్యార్థులతో పాటు, ఎక్స్ఛేంజ్ స్కాలర్లుగా వెళ్లే ప్రొఫెసర్లు, పరిశోధకులు, నిపుణులు, ట్రైనీలు, ఇంటర్న్‌లు, వైద్య నిపుణులకు కూడా వర్తిస్తోంది. ఇలాంటి అనుకూల పరిస్థితులను తగ్గిస్తూ, విద్యార్థి వీసాల వ్యవస్థను కఠినతరం చేయాలని ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రణాళిక వేస్తోంది. తదనుగుణంగా, ఫిక్స్‌డ్ టైమ్ పీరియడ్‌తో కూడిన వీసాలనే మంజూరు చేయాలని ప్రతిపాదన రూపొందించింది. అంటే ఇకపై విద్యార్థి వీసాలకు సైతం ఒక నిర్దిష్ట గడువు విధించబడనుంది.
వివరాలు
ఈ ప్రతిపాదనలను 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' శాఖకు సమీక్ష
వీసా గడువు పూర్తైన తర్వాత, అక్కడే ఉండాలనుకునే విద్యార్థులు మళ్లీ వీసా పొడిగింపుకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' శాఖకు సమీక్ష కోసం పంపించారు. ఆ తరువాత దీన్ని 'ఫెడరల్ రిజిస్ట్రీ'లో ప్రచురించి, 30 నుంచి 60 రోజులు వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రజాభిప్రాయాల అక్కర్లేకుండానే తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా ఈ మార్పులను వెంటనే అమలుచేసే అవకాశమూ ఉందని సమాచారం.
వివరాలు
అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు
ఈ మార్పులపై న్యాయవాదులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెంచుతుందని, అనవసరమైన అయోమయ పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులపై ఈ ప్రతిపాదిత మార్పుల ప్రభావం గణనీయంగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు.