Page Loader
Japan Airlines: జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో సాంకేతిక లోపం.. 36 వేల అడుగుల నుంచి అకస్మాత్తుగా కిందికి..
36 వేల అడుగుల నుంచి అకస్మాత్తుగా కిందికి..

Japan Airlines: జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో సాంకేతిక లోపం.. 36 వేల అడుగుల నుంచి అకస్మాత్తుగా కిందికి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానాల్లో వరుసగా సంభవిస్తున్న సాంకేతిక లోపాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా ఘటన జూన్ 30న చోటు చేసుకుంది. షాంఘై నుంచి టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే పైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జూన్ 30న చైనా షాంఘై నగరం నుంచి జపాన్ రాజధాని టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం అర్ధాంతరంగా సాంకేతిక లోపానికి గురైంది. ఈ లోపం కారణంగా విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా 10,500 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఈ హఠాత్ పరిణామం ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళానికి, భయభ్రాంతులకు దారి తీసింది.

వివరాలు 

విమానంలో సిబ్బంది సహా మొత్తం 191మంది  ప్రయాణికులు 

ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన సిబ్బంది,వెంటనే ఆక్సిజన్ మాస్కులు అందుబాటులోకి తెచ్చారు. విమానంలో ఉన్న సిబ్బంది సహా మొత్తం ప్రయాణికుల సంఖ్య 191మందిగా ఉన్నట్లు సమాచారం. విమానంలో సమస్య ఏర్పడిన వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానం కూలిపోతుందనే భయంతో కొంతమంది ప్రయాణికులు తమ కుటుంబసభ్యులకు సందేశాల ద్వారా తమ ఆస్తుల వివరాలు,బీమా సమాచారంతో పాటు వీలునామా పత్రాలను పంపించారు. పైలట్ సత్వరంగా స్పందించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని తెలియజేశారు.

వివరాలు 

సాంకేతిక లోపంపై విచారణ ప్రారంభించిన  అధికారాలు 

ఆ తరువాత విమానాన్ని జపాన్‌లోని ఒసాకా ప్రాంతంలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు తాత్కాలికంగా వసతి కల్పించాక, వారికి వేరే విమానాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కల్పించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన సాంకేతిక లోపంపై అధికారాలు విచారణ ప్రారంభించాయి.