
Donald Trump:ఇరాన్‌తో అణుఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో అణు ఒప్పందం(న్యూక్లియర్ డీల్) కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఒమన్‌లో ఈ ఒప్పందంపై కీలక చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో ట్రంప్ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, సైనిక చర్య తప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఒక విలేకరి "ఇరాన్ అణు ఒప్పందాన్ని ఒప్పుకోకపోతే సైనిక చర్య ఉంటుందా..?" అని అడగగా, ట్రంప్ స్పందిస్తూ.. "అవసరమైతే ఖచ్చితంగా సైనిక చర్యకు వెళ్తాం. వారు డీల్ ఒప్పుకోకపోతే చర్య తప్పదు. ఇందులో ఇజ్రాయెల్ పాత్ర కూడా ఉంటుంది," అని చెప్పారు.
ఈ సందర్భంగా అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో సమయం లేదన్నారు.
వివరాలు
బాంబు దాడులు జరిగే ప్రమాదం
ట్రంప్ ఇటీవలే న్యూక్లియర్ డీల్‌పై శనివారం ఒమన్‌లో ప్రత్యక్షంగా ఉన్నతస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.
టెహ్రాన్ ఆ చర్చల్లో దౌత్యపరమైన ఒప్పందానికి తిరస్కారం తెలిపితే, ఆ దేశానికి అది తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని అన్నారు.
బాంబు దాడులు జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అమెరికాతో కేవలం పరోక్షంగా మాత్రమే చర్చలు జరుగుతాయని వెల్లడించింది.
ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, 2018లో అమెరికా అధికారికంగా అణుఒప్పందం నుంచి తప్పుకుంది.
అటుపై టెహ్రాన్‌పై ఆంక్షలు కూడా విధించాయి. అప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్న అవి విఫలమయ్యాయి
వివరాలు
స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ
తాజాగా ట్రంప్ మరోసారి చర్చలకు ఆసక్తి చూపారు. "ఇరాన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు, అందుకే నేరుగా చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నా" అని అన్నారు.
ఇప్పటికే ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ,ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం ప్రత్యక్ష చర్చలను తిరస్కరించారు.
పరోక్ష చర్చలకు మాత్రమే సిద్ధమని చెప్పారు. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అణుఒప్పందంపై టెహ్రాన్ తిరస్కారం చెబితే, బాంబు దాడులు జరగడం ఖాయమని, ఇవి ఇప్పటివరకు ఎప్పుడూ జరగని స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రంగా స్పందించారు.
అమెరికా సైనిక చర్యకు దిగితే, తమ దేశం ఘాటుగా ప్రతిదాడి చేస్తుందని స్పష్టం చేశారు.