Trump: కెనడా వస్తువులపై సుంకాల మినహాయింపు.. ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై విధించిన సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైన్ రాష్ట్ర సెనేటర్ సూసన్ కాలిన్స్ మరోసారి ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని రైతులు, స్థానిక వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం ఈ మినహాయింపులు ప్రకటించింది. గత జూలైలో కెనడా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం వరకు సుంకాలు విధించింది.
వివరాలు
శీతలీకరణ పరికరాలు, ప్లైవుడ్, ప్యాకింగ్ యంత్రాలపై సుంకాలను పూర్తిగా తొలగించింది
అయితే తాజాగా వైట్‌హౌస్ ప్రకటించిన సవరించిన నిబంధనల ప్రకారం మైన్ రాష్ట్రంలో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే శీతలీకరణ పరికరాలు, ప్లైవుడ్, ప్యాకింగ్ యంత్రాలపై సుంకాలను పూర్తిగా తొలగించింది.
దీంతో బ్లూబెర్రీలు, బంగాళాదుంపలు, ఆపిల్స్, సీవీడ్ ఉత్పత్తి చేసే రైతులకు, సాగుదారులకు ఊరట లభించనుంది.
అమెరికా మార్కెట్లో సులభంగా అందుబాటులో లేని కొన్ని ప్రత్యేక పరికరాలు, ప్యాకింగ్ సామగ్రి కోసం మైన్ రాష్ట్ర రైతులు కెనడాపై ఆధారపడుతున్నారు.
ఇలాంటి వస్తువులపై దిగుమతి సుంకాలు విధించడం వల్ల రైతుల ఖర్చులు పెరిగి, వారిపై ఆర్థిక భారం పడుతోందని సెనేటర్ సూసన్ కాలిన్స్ ప్రభుత్వానికి వివరించారు.
ఈ సమస్యను పరిష్కరించి, అవసరమైన వస్తువులపై సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరారు.
వివరాలు
ఈ మినహాయింపులు కెనడా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులకూ వర్తించవు
ఆమె చేసిన విజ్ఞప్తి నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, కెనడా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులకూ ఈ మినహాయింపులు వర్తించవు.
కోకో పౌడర్, వినైల్ ఫ్లోరింగ్, షాంపూ, కేనాలు, చెక్కతో తయారు చేసిన శవపేటికలు, కార్పెట్లు వంటి ఇతర ఉత్పత్తులపై కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి.
ఈ సవరించిన నిబంధనలు అక్టోబర్ 30 నుంచి అమలవుతాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
వివరాలు
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు
డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా, కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
కెనడా నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ అనే మాదకద్రవ్యం అక్రమంగా రవాణా అవుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం సుంకాల విధింపును ప్రారంభించింది.
దీనికి తోడు కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా అభివర్ణించడం, రక్షణకు సంబంధించిన నిబంధనలను ఉపసంహరించుకుంటామని హెచ్చరించడం వంటి ట్రంప్ వ్యాఖ్యలు కెనడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ పరిణామాల మధ్య కొన్ని దిగుమతులపై సుంకాలను తొలగిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా, వాణిజ్యపరంగా చర్చనీయాంశమైంది.