
Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ అతి త్వరలోనే విక్రయాలు.. DOGEసాఫ్ట్‌వేర్ తయారీ..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న 'గోల్డ్ కార్డ్' త్వరలో మార్కెట్‌లోకి రానుంది.
వారం లేదా పది రోజుల్లో దీన్ని విక్రయాలకు సిద్ధం చేయనున్నట్టు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడైంది.
ఆయన నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) సంస్థ దీని అభివృద్ధిలో ప్రధానంగా పాల్గొంటోంది.
ఈ గోల్డ్ కార్డ్‌ను ప్రత్యేకంగా సంపన్న విదేశీయులకు అందుబాటులోకి తేవాలని మస్క్ బృందం యోచిస్తోంది.
దీనికి అనుగుణంగా ఓ ప్రత్యేకమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
మస్క్ బృందానికి చెందిన ఇంజినీర్లు, ఈ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి కీలకమైన అంశాలను రూపొందించేందుకు పని చేస్తున్నారు.
వివరాలు
ప్రాజెక్టుకు మార్కో ఎలెజ్,ఎడ్వర్డ్ కోరిస్టినె నేతృత్వం
ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే, అమెరికా పౌరసత్వం కోసం సంపన్నుల కోసం ప్రత్యేక మార్గాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
అదే ఈ గోల్డ్ కార్డ్ రూపంలో ప్రజలకు అందించనున్నారు. ఇటీవల ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ నమూనాను ప్రజలకు చూపించారు.
అందులో ఆయన ఫోటోతో పాటు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జాతీయ పక్షి అయిన బాల్డ్ ఈగిల్ ప్రతీకలు కూడా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకు మార్కో ఎలెజ్,ఎడ్వర్డ్ కోరిస్టినె నేతృత్వం వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఈ ఇద్దరూ ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ ఏజెన్సీల అధికారులతో సమావేశమయ్యారు.
వివరాలు
5 బిలియన్ డాలర్లు వసూలు
వీసా మరియు ఇమిగ్రేషన్ విధానాలపై చర్చలు జరిపారు. గోల్డ్ కార్డ్‌కు అనువైన విధానం కోసం అన్వేషణ జరుపుతున్నారు.
ఇప్పటికే ఉన్న వీసా అప్లికేషన్ ప్రక్రియలను అడ్డంగా దాటి, ఒక ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించాలన్నది వారి లక్ష్యం.
గతంలో వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఒక రోజు వ్యవధిలోనే 1000 గోల్డ్ కార్డులు అమ్ముడుపోయినట్టు చెప్పారు.
వీటి ద్వారా 5 బిలియన్ డాలర్లు వసూలు చేశామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.7 కోట్ల మంది ఈ గోల్డ్ కార్డ్‌ను కొనుగోలు చేసే ఆర్థిక స్థితి కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
అయితే, అప్పటివరకు ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను మాత్రం వెల్లడించలేదు.
వివరాలు
EB-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాకు 4 బిలియన్ డాలర్లు ఆదాయం
ఈ గోల్డ్ కార్డ్, ప్రస్తుతం ఉన్న EB-5 వీసా ప్రోగ్రాంను భర్తీ చేయనుంది.
గత సంవత్సరం ఈ EB-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికా సుమారు 4 బిలియన్ డాలర్లు ఆదాయం పొందింది.
అయితే ఈ ప్రోగ్రామ్ వల్ల జరిగిన మోసాలు, అక్రమ కార్యకలాపాల నివారణకు గోల్డ్ కార్డ్‌ను తీసుకువస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
చట్టబద్ధమైన పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం మరియు శాశ్వత నివాసం లభించేందుకు ఇది మార్గం కానుంది.