Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, తన అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలను ముందుగానే వెల్లడిస్తున్నారు. తాజాగా డే లైట్ సేవింగ్ టైమ్‌ను రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ డే లైట్ సేవింగ్ టైమ్‌ను పూర్తిగా రద్దు చేస్తుందని, ఈ పద్ధతిని కొనసాగించడం అనవసరమని, ఇది అమెరికన్లపై ఆర్థిక భారం మోపుతోందని ఆయన చెప్పారు. 2021లో సెనేటర్ మార్కో రూబియో న్యూ స్టాండర్డ్ టైమ్ పేరుతో ఒక బిల్లును ప్రతిపాదించారు. అయితే అప్పట్లో ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం లభించలేదు. ట్రంప్ అధ్యక్షత్వంలో రూబియో స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు
ఆయన ప్రకటించిన సమాచారం ప్రకారం డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల విద్యుత్ వినియోగం, ఆర్థిక వ్యవహారాలపై అధిక భారం పడుతుందని అధ్యయనాలు తేల్చాయి. డే లైట్ సేవింగ్ టైమ్ మొదటగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచే వసంత కాలంలో ఒక గంట ముందుకు, శరదృతువులో ఒక గంట వెనక్కి గడియార సమయాలను మార్చుకోవడం అమెరికాలో సాంప్రదాయంగా కొనసాగుతోంది. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై అమెరికా ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దశాబ్దాలుగా పాటిస్తున్న డే లైట్ సేవింగ్ టైమ్ విధానం చరిత్రలో కొత్త మలుపు తిరగనుంది.