
Trump: ట్రంప్ సుంకాల దాడి మళ్లీ మొదలు.. మెక్సికో, ఈయూకు 30శాతం టారిఫ్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ వాణిజ్య రంగాన్ని మరోసారి కదిలించారు. మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. ఈ విధానాలు వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్రంప్ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌లకు లేఖలు పంపారు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు ట్రంప్ విధించిన సుంకాల పరిధిలో 24 దేశాలతో పాటు మొత్తం 27 ఈయూ దేశాలు చేరినట్లయ్యింది. ఈవిషయంపై స్పందించిన ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా.. పరస్పర చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Details
ట్రంప్ నిర్ణయంతో ప్రతీకార సుంకాల ముప్పు?
అయితే, ఈ ట్రంప్ నిర్ణయం వ్యాపార సంబంధాల్లో తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం.. అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాలకు ప్రతిగా, సంబంధిత దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రస్తుతం 25 శాతం ఉన్న సుంకాన్ని 30 శాతానికి పెంచనున్నట్లు సమాచారం. అయితే అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందం (USMCA) పరిధిలోకి వచ్చే వస్తువులపై ఇది వర్తించదన్న అభిప్రాయం ఉన్నా.. ట్రంప్ తన లేఖలో దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల చర్చ నడుస్తోంది.
Details
ఈయూ-యూఎస్ వాణిజ్య గణాంకాలపై ట్రంప్ ఆగ్రహం
2024లో అమెరికా-ఈయూ మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో ఈయూ పక్షాన 1980 కోట్లు మిగులు ఉండటాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఈ లోటును తగ్గించేందుకు ఈయూ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అధిక సుంకాలు విధించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈయూ నుంచి అమెరికాకు ముఖ్యంగా ఔషధాలు, కార్లు, విమానాలు, రసాయనాలు, మద్యం, వైద్య పరికరాలు అధికంగా దిగుమతవుతుంటాయి. అయితే, అమెరికా కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్, ట్రావెల్ బుకింగ్స్, లీగల్, ఫైనాన్షియల్ సర్వీసుల రూపంలో ఈ లోటును కొంతవరకు తగ్గిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.