
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌లతో అమెరికాలో తీవ్ర పరిణామాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో భారీ సుంకాల విధానం ద్వారా ఓ పెద్ద యుద్ధానికి నాంది పలికారు.
ఇందులో భారత్, చైనా సహా అనేక దేశాలు ప్రభావితమయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ ఆర్థిక నిర్ణయాల వల్ల అమెరికాలోని కంపెనీలు, పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడటంతో, దేశీయంగా కూడా ఆయన విధానాలపై విస్తృత స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా అమెరికా ఫెడ్‌రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా ట్రంప్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రంప్ సర్కారు విధించిన సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం తీవ్రమవుతుందన్నారు.
ట్రంప్ పాలనలో తీసుకున్న విధాన మార్పులు ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేశాయని ఆయన విమర్శించారు.
వివరాలు
ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరే ప్రమాదం
చికాగోలో జరిగిన ఒక సమావేశంలో పావెల్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ప్రాథమికంగా, వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. ఇవి ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రకటించిన సుంకాల పరిమాణం ఊహించిన దాని కంటే గణనీయంగా అధికంగా ఉంది. ఈ టారిఫ్‌ల వల్ల ఏర్పడే అనిశ్చితి, దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా హానికరంగా పనిచేయగలదు. అంతేకాకుండా, ఈ విధంగా సుంకాలను పెంచుతుంటే ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరే ప్రమాదం ఉంది. చివరికి వినియోగదారులే అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. దీని ఫలితంగా ఆర్థిక మందగమనం ప్రారంభం కావచ్చని భావిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
వివరాలు
90 రోజుల పాటు టారిఫ్‌ల అమలును తాత్కాలికంగా నిలిపివేత
అంతేకాక, ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతాయని ఆయన హెచ్చరించారు.
ఫెడ్ లక్ష్యాలలో ముఖ్యమైన ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి అంశాలపై ట్రంప్ విధానాలు ఆటంకంగా మారుతున్నాయని విమర్శించారు.
గతంలో ఏప్రిల్ 2న ట్రంప్ ప్రభుత్వం భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.
అయితే, కొన్ని దేశాల విషయంలో 90 రోజుల పాటు ఈ టారిఫ్‌ల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.
కానీ చైనాపై మాత్రం భారీగా సుంకాలు విధించి, అవి కొనసాగుతాయని స్పష్టంగా వెల్లడించారు.
ఇదే సమయంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని బహిరంగంగా అనేకసార్లు సమర్థించారు.
ఈ విధానం అమెరికా ఆర్థిక వృద్ధికి బలాన్నిచ్చే దిశగా ఉంటుందనీ, పెట్టుబడుల వృద్ధికి దోహదపడుతుందనీ పేర్కొన్నారు.
వివరాలు
సుంకాల తగ్గింపుపై అనేక దేశాలతో చర్చలు
ఇక సుంకాల తగ్గింపుపై అమెరికా అనేక దేశాలతో చర్చలు జరుపుతోంది.
ఇందులో భాగంగా జపాన్‌తో చర్చలు విజయవంతంగా సాగుతున్నాయని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.