Donald Trump: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. డొనాల్డ్ ట్రంప్ సురక్షితం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా,ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరిస్తుండటంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. ట్రంప్‌కు గోల్ఫ్ ఆడే అలవాటు ఉండగా, ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఒక అనుమానితుడు ఆయుధంతో గోల్ఫ్ క్లబ్ వద్ద కనిపించాడు. అప్పటికే గోల్ఫ్ కోర్టు పాక్షికంగా మూసివేసి ఉండగా, అనుమానితుడు ఆయుధాన్ని కోర్టు కంచెలో ఉంచాడు.
ఏకే 47 మోడల్ తుపాకీ స్వాధీనం
ఈ ఘటనతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. అనుమానితుడు ఎస్‌యూవీ వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించినా, పోలీసులు అతనిని వెంటబడి మరి పట్టుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఏకే 47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ఎఫ్‌బీఐ ట్రంప్‌పై హత్య యత్నంగా ఇది జరిగింది అని వెల్లడించింది. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నారని,అమెరికాలో హింసకు తావు ఉండదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని అధ్యక్షుడు బైడెన్‌కు అందజేశారు.రిపబ్లికన్ సభ్యుడు,సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఈ ఘటనపై స్పందిస్తూ, ట్రంప్ క్షేమంగా ఉన్నారని, తాను చూసిన వక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు.
గతంలో కాల్పుల ఘటన
గతంలో కూడా, జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్నప్పుడు, థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పక్క నుంచి తూటా దూసుకుపోయింది. తాజాగా మరోసారి కాల్పుల ఘటనతో తిరిగి కలకలం రేగింది.