Trump-Biden: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. మాజీ అధ్యక్షుడు బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే గత ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని ప్రకటించిన ట్రంప్... తాజాగా బైడెన్ సంతానానికి అందిస్తున్న సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
బైడెన్ కుటుంబ భద్రత రద్దు
బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ భద్రత కోసం సీక్రెట్ సర్వీస్‌కు చెందిన 18మంది ఏజెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు.
అలాగే,కుమార్తె ఆష్లే బైడెన్ భద్రత కోసం 13 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు.
వివరాలు
అమెరికా సీక్రెట్ సర్వీస్ రక్షణ నిబంధనలు
అయితే,వీరి భద్రతను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై బైడెన్ కార్యాలయం ఇంకా స్పందించలేదు.
సాధారణంగా,అమెరికా (USA) ఫెడరల్ చట్టాల ప్రకారం,మాజీ అధ్యక్షుడు,వారి జీవిత భాగస్వామికి జీవితకాలం సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తారు.
అయితే,వారి పిల్లలు 16 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత,అధ్యక్ష పదవి వీడిన వెంటనే భద్రత తొలగించబడుతుంది.
కానీ,అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొద్ది రోజుల ముందు,బైడెన్ తన పిల్లలకు జూలై వరకు భద్రతను పొడిగిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు.
ఇదే విధంగా, తన తొలిసారి అధ్యక్ష హయాంలో ట్రంప్ కూడా తన పిల్లల కోసం అలాంటి రక్షణ కొనసాగించారు. అయితే, ఇప్పుడు ట్రంప్ మాత్రం బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయడం గమనార్హం.
వివరాలు
క్షమాభిక్షల వివాదం
బైడెన్ క్షమాభిక్షలపై ట్రంప్ ఇటీవల తీవ్రంగా స్పందించారు. బైడెన్ ఆటోపెన్ (AutoPen) ద్వారా క్షమాభిక్ష పత్రాలపై సంతకాలు చేసినట్లు ఆరోపించారు.
అందుకే, అవన్నీ చెల్లవని ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని గంటల ముందు, బైడెన్ 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించగా, మరో 39 మంది ఖైదీలను పూర్తిగా క్షమించారు.
అమెరికా ఆధునిక చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో క్షమాభిక్షలు మంజూరు చేసిన ఉదాహరణ మరెక్కడా లేదని ట్రంప్ విమర్శించారు.